జార్ఖండ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేయాలని గవర్నర్ రమేష్ బైస్ కు కేంద్ర ఎన్నికల సంఘం సిఫారసు చేసింది. కానీ ఇప్పటి వరకు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ అధికారికంగా తెలియజేయకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
తాజాగా హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్‌పై వేటుపడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మైనింగ్ సంస్థకు సహ యజమానిగా ఉన్న ఎమ్మెల్యే బసంత్ సోరెన్‌పై ప్రజా ప్రతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 9ఏ ప్రకారం వేటు వేసేందుకు ఈసీ నిర్ణయాన్ని గవర్నర్ కోరినట్టు తెలుస్తోంది.
ఈ విషయంలో ఈసీ కూడా చాలా తొందరంగా స్పందించినట్టు తెలుస్తోంది. అయితే గవర్నర్ కు ఈసీ ఎలాంటి సిఫారసులు చేసిందనే విషయం ఇంకా తెలియరాలేదు. ఓ వైపు ప్రభుత్వ పదవుల్లో కొనసాగుతూ సీఎం హేమంత్ సొరెన్, బసంత్ సోరెన్‌లు తమకు తాము మైనింగ్ లీజులు ఇచ్చుకున్నారు. దీంతో ఇది వివాదాస్పదం అయింది.
వీరిద్దరూ అక్రమ పద్ధతుల్లో మైనింగ్ లీజులు పొందారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వారిపై ప్రతిపక్ష బీజేపీ విమర్శల దాడిని పెంచింది. గతంలో ప్రజాప్రతినిథ్య చట్టం ప్రకారం సీఎం హేమంత్ సొరెన్ పై అనర్హత వేటు పడింది. ఈ విషయాన్ని గవర్నర్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించికపోవడం గమనార్హం.