– గిరిజన విద్యార్థినిపై దాడి
– నిందితుడిపై చర్యలకు సీఎం ఆదేశం
– యువకుడిని రిమాండ్ కు తరలించిన పోలీసులు
మహిళలపై రోజూ ఏదో ఒక చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గిరిజన విద్యార్థినిపై యువకుడు చేసిన క్రూర దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ లోని దుమ్కా జిల్లా పాకూర్ నియోజకవర్గానికి చెందిన గిరిజన విద్యార్థినిని ఓ యువకుడు ఇష్టానుసారంగా కొట్టాడు.
పొలాల్లోకి తీసుకెళ్లి బాలికను చిత్రవధ చేశాడు. కాలితో ఘోరంగా తంతూ పరిగెత్తించాడు. కొద్ది సేపు పరుగులు తీసిన బాధితురాలు దెబ్బలు తాళలేక కింద పడిపోయింది. అయినా యువకుడు కనికరించలేదు. పశువులా మారి తంతూనే ఉన్నాడు. ఇదంతా రికార్డు చేసి యువకుడి స్నేహితులు పైశాచిక ఆనందం పొందారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సామాజికవేత్త రజనీ ముర్ము ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని జార్ఖండ్ సర్కార్ దృష్టికి తీసుకెళ్లింది. సీఎం హేమంత్ సోరెన్, పాకుర్ అసెంబ్లీ ఎమ్మెల్యే, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని ట్యాగ్ చేసింది. ఈ క్రమంలోనే హేమంత్ సీరియస్‌గా స్పందించారు. నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకుని వివరాలు తెలపాలని పాకుర్ డీసీ, ఎస్పీలను ఆదేశించారు.
సీఎం ఆదేశంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఈ దారుణ ఘటన 15 రోజుల కిందట జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. యువకుడికి, విద్యార్థినికి మనస్పర్థలు తలెత్తిన క్రమంలోనే దాడి చేశాడని తెలిపారు.