గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. ప్రధాని మోడీకి వ్యతిరేక ట్వీట్లు చేసినందుకు ఆయనను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆ కేసులో సోమవారం బెయిల్ లభించిన కొద్ది సేపటికే మరో కేసులో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ప్రధానికి వ్యతిరేక ట్వీట్ల కేసులో ఆయన పాలంపూర్ లో అరెస్టు చేసి గౌహతికి తరలించారు. అక్కడి నుంచి కోక్రాఝర్ కు తీసుకు వస్తున్న బృందంలోని మహిళా పోలీసు కానిస్టేబుల్ పై దాడి చేసి వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు.
అసోంలోని బార్‌పేట జిల్లా గుండా వెళుతున్నప్పుడు మేవానీ తనను అసభ్యంగా దూషించాడని మహిళా కానిస్టేబుల్ ఆరోపించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అతను అసభ్యంగా సైగలు చేసి తనను కారు సీటుకు నెట్టాడని మహిళా కానిస్టేబుల్ ఆరోపించినట్టు పోలీసులు చెబుతున్నారు.
దీంతో ట్వీట్ల కేసులో బెయిల్ పై బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోనే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత వారం ప్రధాని మోడీపై వివాదాస్పద ట్వీట్లు చేశారని మేవానిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో అసోంకు చెందిన బీజేపీ నేత అరుప్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఆయనపై నేరపూరిత కుట్రలకు పాల్పడుతున్నారని, మత ఘర్షణలు రెచ్చగొడుతున్నారంటూ ఇంకా పలు అంశాలను చేర్చి ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయనను గుజరాత్ లో గురువారం అరెస్టు చేశారు.