మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య ప్లాన్ కేసుపై దమ్ముంటే జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయించాలని సవాల్ చేశారు బీజేపీ నేత జితేందర్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని.. ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధిస్తోందని పాలమూరులో మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జితేందర్ రెడ్డి, బీజేపీ జాతీయ బీసీ కమిషన్ మెంబర్ ఆచారి సహా పులువురు నేతలు పాల్గొన్నారు. బాధితుల కుటుంబసభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన జితేందర్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
తాను చేసిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. ఉద్యమకారుడు.. తమతో పాటు జైలులో ఉన్న మున్నూరు రవికి ఆతిథ్యం ఇవ్వడం తప్పా అని నిలదీశారు. ఉద్యమకారులను కేసీఆర్ మర్చిపోవచ్చు గానీ.. తాను మాత్రం మర్చిపోనని స్పష్టం చేశారు. రవి తన ఇంటికి రావడం ఇదేమీ మొదటిసారి కాదన్న జితేందర్ రెడ్డి.. మహబూబ్ నగర్, హైదరాబాద్, ఢిల్లీలోని తన నివాసాల దగ్గరకు ఎవరు ఏ సమస్య వచ్చినా తలుపు తీస్తానని తెలిపారు.
1996లో రాజకీయంలో అడుగు పెట్టిన తాను ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలిచానన్నారు జితేందర్ రెడ్డి. ప్రజలు తనను ఎన్నడూ ఓడించలేదని.. నాయకులే టిక్కెట్ రాకుండా రాజకీయం చేశారని చెప్పారు. తనను చూసి చంద్రుడే ఈర్ష పడుతున్నాడని అన్నారు. మున్నూరు రవి డిల్లీకి వచ్చినప్పుడు తాను హైదరాబాద్ లో ఉన్నానని.. ఇప్పుడే కాదు ఇకపై కూడా తనను నమ్మిన వారికి ఆతిథ్యం ఇస్తానని చెప్పారు. కేసీఆర్ తమని జైలులో బంధించలేరని.. సీబీఐ మీద నమ్మకం లేకపోతే జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయించాలన్నారు.
అయినా.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఎందుకు హత్య చేస్తారని ప్రశ్నించారు జితేందర్ రెడ్డి. నెత్తిన అణా పెట్టినా ఆయన్ను ఎవరూ కొనరని అన్నారు. ఫుల్ సెక్యూరిటీతో కుయ్ కుయ్ అనే కార్లలో తిరిగే మంత్రిని సామాన్యులు చంపగలరా అని ప్రశ్నించారు. లక్షమంది పాలమూరు బిడ్డల్ని ఇంటర్వ్యూ చేస్తే అది ఫేక్ కేసు అని తేలిందన్నారు. రాజులు మహారాజులే పతనం అయ్యారు మీరెంత అంటూ మండిపడ్డారు. స్టీఫెన్ రవీంద్ర భయపడుతూ స్క్రిప్ట్ చదివారని విమర్శించారు. రాత్రి ఇంట్లోని దేవుడి ముందు కూర్చుని తప్పు చేశానని.. ఆయన మన్నించు అని అనుకునే ఉంటారని అన్నారు.
తన ఇంటి మీద దాడి చేస్తుంటే పోలీసులు తమషా చూస్తున్నారని మండిపడ్డారు జితేందర్ రెడ్డి. ఖాకీ యూనిఫాంకు విలువ లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తానూ పోలీసోడి బిడ్డనేనని.. నాయకులకు పోలీసులు తొత్తులుగా పని చేయకూడదన్నారు. పోలీసులు పెట్టిన అక్రమ కేసుపై సమగ్ర విచారణ చేయిస్తామని.. దీన్ని అమిత్ షా ముందు పెడతామని తెలిపారు. బాధిత కుటుంబాల ఉసురు తగలకుండా ఉండదని.. తెలంగాణ సాధించుకుంది ఇందుకేనా అని ప్రశ్నించారు జితేందర్ రెడ్డి.