పాక్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. అనుమానిత పాక్ డ్రోన్ ఒకటి గురువారం ఉదయం భారత సరిహద్దుల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. దీంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. దీంతో డ్రోన్ తిరిగి పాక్ సరిహద్దుల్లోకి వెళ్లిపోయినట్టు అధికారులు తెలిపారు.
ఘటన నేపథ్యంలో భద్రతా సిబ్బంది అలెర్ట్ అయింది. సరిహద్దు వెంట ఎక్కడైనా బాంబులు, ఆయుధాలను జారవిడిచిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు సరిహద్దుల వెంట సెర్చ్ ఆపరేషన్ ను భద్రతా దళాలు ప్రారంభించాయి. నిఘాను మరింత పటిష్టం చేసినట్టు అధికారులు వివరించారు.
‘ఈరోజు ఉదయం 4గంటల15 నిమిషాల సమయంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అర్నియా ప్రాంతంలో ప్రకాశవంతమైన కాంతిని గమనించాము. వెంటనే మా సిబ్బంది కాల్పులు జరిపారు. దీంతో డ్రోన్ తిరిగి పాక్ లోకి వెళ్లిపోయింది. సరిహద్దు వెంట సిబ్బందిని అలెర్ట చేశాము’అని బీఎస్ఎఫ్ ప్రతినిధి తెలిపారు.
జమ్మూ, కథువా, సాంబా సెక్టార్లలో ఇటీవలి కాలంలో అనేక డ్రోన్‌లను బలగాలు కూల్చివేశాయి. ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలతో పాటు పేలోడ్‌లను స్వాధీనం చేసుకున్నాయి. సోమవారం కూడా డ్రోన్ ద్వారా జారవిడిచిన మూడు మాగ్నెటిక్ ఐఇడిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.