జమ్మూ కశ్మీర్ కు చెందిన పోలీస్ అధికారి దేవేందర్ సింగ్ ఉగ్రవాదులతో పట్టుబడడం సంచలనం రేపుతోంది. శ్రీనగర్ టు జమ్ము హైవేలో ఢిల్లీ వెళ్లే వాహనంలో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో కలిసి ప్రయాణిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ దేవేందర్ సింగ్ శ్రీనగర్ లోని సున్నిత ప్రాంతమైన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో డ్యూటీ చేస్తున్నాడు. అత్యంత ధైర్య సాహసాలు కలిగిన ఆఫీసర్ గా దేవేందర్ సింగ్ రాష్ట్రపతి అవార్డు నందుకున్నారు.
దేవేందర్ సింగ్ తో ఉన్న ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల్లో నవీద్ బాబు. ఆసీఫ్ లున్నారు. నవీద్ బాబు మాజీ స్పెషల్ పోలీస్ అధికారి.నవీద్ బాబు గత ఏడాది అక్టోబర్-నవంబర్ లో ఒక ట్రక్ డ్రైవర్ తో సహా 11 మంది కశ్మీరేతర కూలీలను హత్య చేసిన కేసులో నిందితుడు. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీరేతరులు, యాపిల్ ఇండస్టీ టార్గెట్ గా దాడులు చేశాడు.
ఉగ్రవాది నవీద్ బాబు కదలికలపై తాము కొంత కాలంగా నిఘా పెట్టామని…నవీద్ బాబు తన సోదరుడికి కాల్ చేయడంతో అతని లొకేషన్ గుర్తించి పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. విచారణలో నవీద్ బాబు, దేవేందర్ సింగ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు శ్రీనగర్, దక్షిణ కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్ లోని బాదామి బాగ్ లో ఉన్న దేవేందర్ సింగ్ ఇంట్లో ఒక ఏకే -47 రైఫిల్, రెండు పిస్తోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ తో కలిసి ఉగ్రవాదులు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారనే విషయం విచారణలో తేలుతుందని పోలీసులు చెప్పారు. దేవేందర్ సింగ్ నాలుగు రోజులు సెలవు కోసం దరఖాస్తు పెట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.