జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. హిందువులే టార్గెట్ గా దాడులకు దిగుతున్నారు. తాజాగా గురువారం ఓ బ్యాంక్ ఉద్యోగిపై ఓ ఉగ్రవాది కాల్పులు జరిపాడు. ఈ వారంలో ఇది మూడవ ఘటన కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ హిందు, మైనార్టీ కమ్యూనిటీలకు సురక్షిత ప్రాంతాల్లో పోస్టింగ్ లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ ప్రక్రియను జూన్ 6లోగా పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు గాను ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయనున్నారు.
ఇందులో భాగంగా హిందువులు, మైనార్టీలు తమ సమస్యలను ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకోని అధికారులపై కఠినచర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
మైనార్టీ కమ్యూనిటీ ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు jk.minoritycell@gmail.com లేదంటే 0194-2506111, 2506112 నంబర్లకు ఫోన్ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ ఫిర్యాదులపై అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు.
లోయలో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రత, వసతికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక సూచనలు చేసింది. ఉద్యోగుల నివాసాలను సురక్షిత ప్రదేశాల్లో ఉండేలా ప్రభుత్వం చూడనుంది. అలాగే పీఎం ప్యాకేజీలో పని చేస్తున్న కశ్మీరీ పండిట్ల ప్రమోషన్, సీనియారిటీ జాబితా, డిపార్ట్‌మెంటర్ ప్రమోషన్స్ లాంటి జాబితాలను మూడు వారాల్లో సిద్ధం చేయనున్నారు.