జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించిన కొత్త ఫిల్మ్ ఫాలసీ ఆసక్తికరంగా మారింది. ఆర్టికల్ 370 రద్దుకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 5 న ఈ కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తున్నట్టు గవర్నర్ చెప్పగా.. అందకు సంబంధించిన వివరాలను జమ్మూ కాశ్మీర్ ఫిల్మ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (JKFDC) తాజాగా వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
JKFDC కొత్త నిబంధనల ప్రకారం, జమ్మూ కాశ్మీర్‌లో ఎవరైనా సినిమా షూటింగులు చేయాలనుకొంటే.. ఇకపై చిత్ర నిర్మాతలు తమ స్క్రిప్ట్‌లను ముందుగా తమకు సమర్పించాలని J&K ప్రభుత్వం చెబుతోంది. వివరణాత్మక స్క్రిప్ట్ తోపాటు సినిమా సారాంశాన్ని ముందుగానే తెలియజేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఆ స్క్రిప్ట్‌ను జమ్మూ కాశ్మీర్ ఫిల్మ్ సెల్ నిపుణులు పరిశీలించి.. షూటింగ్‌కు అనుమతి ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తారని స్పష్టం చేసింది. ఏదైనా సునిశిత అంశాలతో కూడిన స్క్రిప్ట్ అయితే.. సినిమా విడుదలకు ముందే ఫిల్మ్ సెల్ ప్రతినిధికి పూర్తి చేసిన చిత్రాన్ని చూపించాల్సిన అవసరం ఉంటుందని JKFDC చెబుతోంది.
ప్రభుత్వ విధానాల ప్రకారం.. షూటింగులకు అనుమతి పొందిన చిత్ర యూనిట్‌లకు షూటింగుల సమయంలో అవసరమైతే ఉచితంగా భద్రతను కూడా కల్పిస్తామని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం చెబుతోంది. అయితే గతంలో ఇలాంటి నిబంధనలు ఏవీ లేవని కొందరు ఫిల్మ్ మేకర్లు ప్రశ్నిస్తుండగా.. సినిమాల రూపంలో ఇకపై దేశద్రోహ చర్యలను నియంత్రించేందుకే ఈ పాలసీ అని అక్కడి అధికారులు స్పష్టం చేస్తున్నారు.