జమ్ము కశ్మీర్ జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా(57) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన గొంతు కోసి వుండటం, శరీరంపై కాలిన గాయాలు ఉండటంతో ఆయన్ని ఎవరో హత్య చేసి వుంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ హత్య తమ పనేనంటూ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్-పీఏఎఫ్ఎఫ్ అనే సంస్థ ప్రకటన చేసింది. తమ స్పెషల్ స్క్వాడ్ ప్రత్యేకంగా నిఘా పెట్టి మరి ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసిందని వెల్లడించింది. ఇలాంటి హైప్రొఫైల్ ఆపరేషన్లకు కేవలం ఇది ఆరంభం మాత్రమేనని పేర్కొంది.
తాము తలచుకుంటే ఎవరినైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఖచ్చితంగా దాడి చేయగలమని హిందుత్వ పాలకులను, వారి భాగస్వాములను హెచ్చరికలు పంపేందుకే ఈ హత్య చేసినట్టు తెలిపింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య కశ్మీర్ లో పర్యటనకు రాబోతున్న కేంద్ర హోం మంత్రికి ఇదొక చిరు కానుక అని ప్రకటనలో పేర్కొంది.
రాబోయే రోజుల్లో ఇలాంటివి మరిన్ని ఆపరేషన్లు చేపడతామని హెచ్చరించింది. ఈ కేసులో పని మనిషి పరారీలో ఉండటం అనుమానాలకు తావిచ్చింది. దీంతో పని మనిషి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో ఇది తమ పనే అంటూ పీఏఎఫ్ఎఫ్ ప్రకటించుకుంది.