ఫీజుల వసూళ్లలో ప్రైవేట్ విద్యా సంస్థలకేమీ తీసిపోమని నిరూపించుకున్నాయి తెలంగాణలోని ప్రభుత్వ యూనివర్సీటీలు. జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు బీటెక్ ఫీజుల మోత మోగించాయి. ఇప్పటిదాకా ఉన్న ఫీజులును అమాంతం రెండింతలు చేశాయి. రెగ్యులర్‌తో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులను భారీగా పెంచేశాయి. ఇప్పటిదాకా రెగ్యులర్ కోర్సుల ఫీజు రూ.18 వేలుగా ఉంటే.. ఇప్పుడు రూ. 35 వేలకు చేరింది. ఇక సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజు ఏకంగా రూ. 70 వేలకు పెరిగిపోయింది. ఉస్మానియాలో ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని అనుకుంటున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ఫీజు అయితే.. చుక్కలనంటింది. ఏఈ కోర్సు ఫీజును రూ. 1.20 లక్షలుగా నిర్ణయించారు. అటు మైనింగ్ ఇంజనీరింగ్ ఫీజును రూ. లక్షగా ఉండనుందని వర్సిటీ తెలిపింది.
యూనివర్సీటీలు ఫీజులు పెంచుకోవచ్చని రెండు నెలల క్రితం విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో దొరికిందే అవకాశమన్నట్టు భారీగా పెంచాయి ఉస్మానియా, జేఎన్టీయూ. వాస్తవానికి రూ. 45 వేల వరకు మాత్రమే ఏ కోర్సు ఫీజు అయినా ఉండాలని విద్యాశాఖ మార్గదర్శకాల్లో సూచించింది. కానీ ఈ రెండు వర్సిటీలు ఆ విషయాన్ని అసలు పట్టించుకోనేలేదు. ఇదిలా ఉంటే కాకతీయ, మహాత్మా గాంధీ యూనివర్సిటీలు మాత్రం ఫీజుల పెంపు జోలికి పోలేదు. తెలంగాణలో ఒక కోర్సుకు సంబంధించి రూ. లక్ష కంటే ఎక్కువ ఫీజు వసూలు చేసే కాలేజీలు 20 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి ఓయూ కూడా చేరడం గమనార్హం