హాస్టల్ ఫీజుల పెంపుకు వ్యతిరేకంగా విద్యార్ధుల చేస్తున్న ఆందోళనకు ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూయూనివర్సిటీ పాలక మండలి దిగొచ్చింది. విద్యార్ధుల ఆందోళనతో యూనివర్సిటీ బయట సమావేశమైన పాలక మండలి ఫీజులను చాలా వరకు తగ్గించింది. అయితే ఆర్ధికంగా వెనుకుబడిన విద్యార్ధులకు ఆర్ధిక సహాయం చేసే పథకాన్ని ప్రతిపాదించామని..విద్యార్ధులు క్లాసులకు హాజరయ్యే సమయం వచ్చిందని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్.సుబ్రమణ్యం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. గతంలో 20 రూపాయలున్న సింగిల్ రూమ్ రెంట్ ను ఒకేసారి రూ.600 కు పెంచింది. అది ఇప్పుడు రూ.200 కు మార్చింది.అదే విధంగా ఇద్దరు విద్యార్ధులుండే రూమ్ రెంట్ ను రూ.10 నుంచి రూ.300 కు పెంచింది. దాన్ని ఇప్పుడు మళ్లీ రూ.100 కు తగ్గించింది. హాస్టల్ ఫీజులను భారీగా పెంచడాన్ని నిరసిస్తూ విద్యార్ధులు 16 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. సోమవారం యూనివర్సిటీ స్నాతకోత్సవం జరిగే ఏఐసీటీఈ బయట విద్యార్ధులు ఆందోళన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్నాతకోత్సవానికి హాజరైన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ బయటకు వెళ్లలేక 6 గంటలు ఏఐసీటీఈ లోనే ఉండాల్సి వచ్చింది. మంత్రి హాజరుకావాల్సిన రెండు ప్రోగ్రామ్స్ కూడా రద్దయ్యాయి. అయితే దీనిపై విద్యార్ధి సంఘాలు ఇంత వరకు స్పందించలేదు.