హాస్టల్ ఫీజుల పెంపుపై ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్ధులు ఆందోళన ఉదృతం చేశారు. గత వారం రోజులుగా ఫీజుల పెంపుపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్ధులు ఈరోజు ఉదయం వందలాది మంది యూనివర్సిటీ గేటు బయట గుమిగూాడారు. ఫీజుల పెంపుపై చర్చించేందుకు ఎన్నిసార్లు వీసీ మామిడాల జగదీశ్ కుమార్ అప్పాయింట్ మెంట్ కోరినా ఇవ్వలేదని విద్యార్ధులు వాపోయారు. హాస్టల్ ఫీజుల పెంపును నిరసిస్తూ ప్లకార్డ్స్, బ్యానర్స్ ప్రదర్శించారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనివర్సిటీలో డ్రెస్ కోడ్..కర్ఫ్యూ టైమింగ్స్ విధించడంపై కూడా విద్యార్ధులు వ్యతిరేకత వ్కక్తం చేస్తున్నారు. ఈరోజు ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో యూనివర్సిటీ స్నాతకోత్సవం జరగనుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్నాతకోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. దీంతో ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్దులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్ధులు అటు వైపు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. విద్యార్ధులను సంప్రదించకుండానే యూనివర్సిటీ అధికారులు ఫీజులను భారీగా పెంచారని యూనివర్సిటీ విద్యార్ది సంఘం ఆరోపిస్తోంది. తెలివైన విద్యార్ధి చదువుకు ఫీజుల పెంపు ఆటంకంగా మారిందని…సమానత్వం కలను అణిచివేస్తుందని విద్యార్ధి సంఘం నాయకులంటున్నారు. పేద వర్గాల నుంచి వచ్చిన విద్యార్ధులకు చదువు అందకుండా ఉందని విద్యార్ధి సంఘం అంటోంది.