ఢిల్లీలోని జె.ఎన్.యులో ఆదివారం తనపై జరిగిన దాడి గురించి యూనివర్సిటీ విద్యార్ధి సంఘం నాయకురాలు ఐషీ ఘోష్ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపడానికే వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 20-30 మంది ఇనుప రాడ్లతో పలు సార్లు తనపై దాడి చేశారని..అసభ్యంగా ప్రవర్తించారని…బూతులు తిట్టారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.
”20-30 మంది మంది ముసుగులు ధరించిన వారు తనను కారు వెనక్కి లాక్కెళ్లి తాను బ్రతిలాడుతున్నా వినకుండా పడిపోయేంత వరకు రాడ్లతో కొట్టారు…కొందరు తన్నారు…తల, చెస్ట్ పై కొట్టారు…వాళ్ల ఉద్దేశం నన్ను చంపడానికే వచ్చారు…బూతులు తిట్టారు…నిన్ను కొడతా..చంపేస్తా అంటూ ఒకతను అరుస్తున్నాడు.. మాస్క్ లేకుండా ఉన్న ఓ వ్యక్తిని నేను గుర్తు పడతాను” అని ఫిర్యాదులో చెప్పారు.
”శరీరమంతా గాయాలయ్యాయి…తల, చెస్ట్, మోచేతుల నుంచి విపరీతంగా రక్తమొచ్చింది..నన్ను, గాయపడ్డ ఇతర విద్యార్ధులను ఎయిమ్స్ కు తీసుకెళ్తే అక్కడ కూడా అడ్డగించారు.
” ఇది నేను చాలా బాధతో రాస్తున్నాను..ఈ సంఘటన జరుగుతున్నప్పుడు మెయిన్ గేట్ దగ్గరున్న పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారు…దాడికి ముందు నన్ను చంపేస్తామని ఏబీవీపీ విద్యార్ధులు బెదిరించారు” అని ఐషీ ఘోష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆదివారం జె.ఎన్.యు లోకి 20-30 మంది గుర్తు తెలియని ముసుగులు ధరించిన వ్యక్తులు మారణాయుధాలతో వచ్చి విద్యార్ధులపై దాడి చేశారు. ఈ దాడిలో యూనివర్సిటీ విద్యార్ధి సంఘం నాయకురాలు ఐషీ ఘోష్ తో పాటు 50 మంది విద్యార్ధులు గాయపడ్డారు. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. వివిధ వర్గాలు విద్యార్ధులకు సంఘీభావం తెలిపి అండగా నిలిచాయి.