ఉత్తరాఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుకేపీఎస్సీ) రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలపై నిరుద్యోగ అభ్యర్థుల నిరసనలు వెల్లువెత్తాయి. పోటీ పరీక్షల పేపర్స్ లీక్ అయ్యాయంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే నిరసనకారులతో ఘర్షణ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో ఈ సంఘటన జరిగింది.
గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ స్థాయి పరీక్షతోపాటు పలు పోటీ పరీక్షల పేపర్లు లీక్ కావడంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. గత కొన్ని రోజులుగా రాజధాని డెహ్రాడూన్‌లో బైఠాయించి నిరసనలు చేస్తున్నారు.
కాగా, గురువారం పోలీసులు, నిరసన చేస్తున్న నిరుద్యోగుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు పేపర్ లీక్‌కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే రిక్రూట్‌మెంట్ పరీక్షల కోసం త్వరలో ‘యాంటీ కాపీయింగ్ లా’ పేరుతో కొత్త చట్టం తెస్తామని చెప్పారు. రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో మోసాలకు పాల్పడే అభ్యర్థులను ఈ చట్టం కింద పదేళ్లు నిషేధిస్తామని వెల్లడించారు