అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైకిల్ తొక్కుతూ కింద పడిపోయారు. ఈ ఘటనలో బైడెన్‌కి ఎటువంటి గాయాలవలేదు. బైడెన్ కిందపడిన వెంటనే.. అక్కడున్నవారు పైకి లేపారు. తాను బాగానే ఉన్నానని బైడెన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
బైడెన్ ప్రస్తుతం తన సొంత రాష్ట్రమైన డెలావర్ లో ఉన్నారు. అక్కడి రెహాబోత్లోని తన బీచ్ హోమ్ నుంచి జూన్ 17 తన భార్య, అమెరికా ప్రథమ మహిళ అయిన జిల్ బిడెన్, మరికొందరితో కలిసి సైకిల్ రైడ్ చేశారు. ఈ క్రమంలో ఓచోట రోడ్డు పక్కన ఉన్న కొందరు మీడియా రిపోర్టర్స్, స్థానికులతో మాట్లాడేందుకు బైడెన్ సైకిల్ ఆపారు. ఆ సమయంలో బ్యాలెన్స్ కోల్పోయిన బైడెన్ ఒక్కసారిగా కిందపడిపోయారు.
బైడెన్ కిందపడిపోవడంతో అక్కడున్నవారు వెంటనే ఆయన్ను పైకి లేపగా.. తనకేమీ అవలేదని.. బాగానే ఉన్నానని బైడెన్ తెలిపారు. బ్యాలెన్స్ కోల్పోవడం వల్లే పడిపోయినట్లు చెప్పారు. బైడెన్ కిందపడిన వార్త వైరల్ అవడంతో వైట్ హౌస్ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.
బైడెన్ కి ఏమీ కాలేదని.. వైద్య సహాయమేమీ అవసరం పడలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా.. బైడెన్ తన 45వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఫ్యామిలీతో కలిసి డెలావర్ వెళ్లారు. శుక్రవారం మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వీకెండ్ ఫ్యామిలీతో అక్కడే గడపనున్నారు.