అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌లో ఈ రోజు ఆకస్మికంగా పర్యటించారు. ఈ నెల 24తో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది పూర్తి కానుంది. ఈ క్రమంలో ఆయన ఉక్రెయిన్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాను ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఉన్నట్టు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని కలిసేందుకు తాను అక్కడికి వెళ్లినట్టు చెప్పారు. ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత పట్ల తమ నిబద్దతను పునరుద్ఘాటిస్తున్నామన్నారు.
ఏడాది క్రితం పుతిన్ తన దండయాత్రను ప్రారంభించాడన్నారు. ఆ సమయంలో ఉక్రెయిన్ బలహీనంగా ఉందని, పశ్చిమ దేశాలు చీలిపోయాయని పుతిన్ భావించాడన్నారు. తమను ఓడించగలమని పుతిన్ అనుకున్నాడని చెప్పారు. కానీ అతను తప్పుగా ఆలోచించాడన్నారు.
ఏడాది కాలంగా ఉక్రెయిన్ కు సైనిక, ఆర్థిక, మానవతా సహాయం అందించేందుకు అట్లాంటిక్ నుంచి పసిపిక్ వరకు గల దేశాల కూటమిని అమెరికా ఏర్పరిచిందన్నారు. ఆ సాయం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. మరోవైపు బిడెన్ పర్యటను ఉక్రెయిన్ ఎంపీ ధ్రువపరిచారు. బిడెన్ కు స్వాగతం అంటూ ఉక్రెయిన్ ఎంపీ లీసియా వాసిలెంకో ట్వీట్ చేశారు.