అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జో బైడెన్ ఇచ్చే స్పీచ్‌ను తయారుచేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి భారత సంతతికి చెందిన వినయ్ రెడ్డి అని తెలుసు. అయితే వినయ్ రెడ్డి తెలుగు రాష్ట్రాలకు చెందినవారని తెలియడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిపోయారు. అతని పూర్వపరాలను తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతుకుతున్నారు.
బైడెన్ స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా నియమితుడైన చోల్లేటి వినయ్ రెడ్డి మూలాలు తెలంగాణలో ఉన్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చొల్లేటి నారాయణరెడ్డి, విజయారెడ్డి దంపతులు అమెరికాలో స్థిరపడ‌్డారు. వారి ముగ్గురు కుమారుల్లో ఒకరే ఈ వినయ్‌రెడ్డి.
వినయ్ రెడ్డి.. చాలా ఏళ్ల క్రితం నుంచే జో బైడెన్‌కు స్పీచ్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ఒబామా రెండోసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన బృందంలో ఉన్న అప్పటి వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్‌కు కూడా స్పీచ్ రైటర్‌గా వినయ్ రెడ్డినే పనిచేశారు. ఇప్పుడు బైడెన్ అధ్యక్షుడు కావడంతో.. వైట్‌హౌస్‌లో ఉండే.. స్పీచ్ రైటింగ్ టీమ్‌కు… వినయ్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు.