హైదరాబాద్: ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో మనస్తాపం చెందినట్లు ఆయన అనుచరులు చెప్పారు. క్వార్టర్స్ ఖాళీ చేసి, గన్‌మెన్లను వదిలేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. నేడు అసెంబ్లీకి కూడా జోగు రామన్న హాజరుకాలేదు. మొదటి నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో కీలకంగా పని చేసిన జోగు రామన్నకు ఇప్పటికే ఒకసారి క్యాబినెట్‌లో అవకాశం దక్కింది. దీంతో మరికొంత మంది ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించేందుకే ఈ సారి జోగు రామన్నను పక్కన పెట్టాల్సి వచ్చిందన్న అభిప్రాయాలు అధికార పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.
మున్నూర్ కాపు సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు అవకాశం దక్కడంతోనే రామన్నకు మంత్రి పదవి అవకాశాలు దూరమయ్యాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకే సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయిస్తే ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే చివరి వరకు ఆశ చూపి ఆఖరి క్షణంలో నో చెప్పడం బాధాకరమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.