కరోనా వైరస్ నియంత్రణకు కొత్తగా మరో మెరుగైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్‌కు అమెరికాలో అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది. ఈ మేరకు ఎఫ్‌డీఏ అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఇతర టీకాలతో పోలిస్తే.. ఈ టీకాకు మరిన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
సాధారణంగా ప్రస్తుతం కరోనా నియంత్రణకోసం అందుబాటులోకి వచ్చిన ఏ వ్యాక్సిన్ అయినా రెండు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. అయితే జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందిచిన వ్యాక్సిన్ కేవలం ఒక డోస్ సరిపోతుందని ఎఫ్‌డీఏ చెబుతోంది. రేపటి నుంచి అమెరికాలో దేశవ్యాప్తంగా అత్యవసర వినియోగం కోసం ఈ టీకా అందుబాటులోకి రానుంది.
మార్చి చివరి నాటికి అమెరికాలో 2కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని జాన్సన్ అండ్ జాన్సన్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల డోసులను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. త్వరలోనే ఇతరదేశాల్లోనూ అత్యవసర వినియోగానికి ఈ సంస్థ దరఖాస్తు పెట్టుకోనుంది.