బీజేపీలో చేరాలని, లేకపోతే బుల్డోజర్ రెడీగా ఉంటుందని మధ్యప్రదేశ్ మంత్రి ఒకరు చేసిన హెచ్చరిక వివాదాస్పదమవుతోంది. మా అధికార పార్టీ ..బీజేపీలో చేరండి.. లేదంటే మీ ఇళ్ల కూల్చివేతకు బుల్డోజర్ సిద్ధంగా ఉంటుందని కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇస్తూ రాష్ట్ర మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా చేసిన వ్యాఖ్య తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏడాదిలో మధ్యప్రదేశ్ లో జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఇందులో అనుమానం లేదని ఆయన రాచోఘర్ నగర్ స్థానిక ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యాఖ్యానించారు.
కొన్ని బీజేపీ పాలిత ఇతర రాష్ట్రాల్లో మాదిరే ఈ రాష్ట్రంలో కూడా ‘బుల్డోజర్ జస్టిస్’ ని అధికారులు పాటిస్తున్నారు. వివిధ నేరాల్లో నిందితులుగా పట్టుబడినవారి ఇళ్ళు, ఆస్తులను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేస్తోంది. ఈ తరహా ‘శిక్ష’ ను అమలు చేస్తున్న సీఎంని ‘మామా’ గా అభివర్ణిస్తున్నారు. నేరాలు క్రిమినల్స్ పట్ల తాము నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామని, వీటిని సహించే ప్రసక్తే లేదని చౌహాన్ ప్రభుత్వం ప్రకటిస్తోంది.
అయితే బీజేపీలో చేరకపోతే బుల్డోజర్ రెడీగా ఉంటుందంటూ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా చేసిన హెచ్ఛరికను కాంగ్రెస్ నేత కేకే. మిశ్రా అపహాస్యం చేశారు. మీ బుల్డోజర్ ఏమీ బ్రిటిషర్లకన్నా పెద్దది కాదని, దాన్ని ఎదుర్కొంటామని ఆయన చెప్పారు.
ఇలాంటి హెచ్చరికలను ఖాతరు చేయబోమన్నారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. మరో కాంగ్రెస్ నేత ఫూల్ సింగ్ బరాయా అయితే.. బీజేపీకి గట్టి సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఈ పార్టీ 50 సీట్లు గెలుచుకున్నా తాను రాజ్ భవన్ ముందు తన ముఖానికి నల్లరంగు పూసుకుంటానన్నారు. ఇది నా ప్రమాణం అన్నారు.