అధికార మదమో, డెమోక్రసీ మీద అవగాహనా రాహిత్యమో తెలియదు గానీ మధ్యప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. మంత్రి మహేంద్రసింగ్ సిసోడియా చేసిన వ్యాఖ్యలకు ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి.
స్థానికంగా జరిగే పౌరసంఘాల ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు బీజేపీలోకి చేరాలని లేకుంటే బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేత తప్పదని మంత్రి సింగ్ హెచ్చరించారు. గుణ జిల్లాలోని రుతియామ్ పట్టణంలో జరిగిన బహిరంగసభలో మంత్రి సింగ్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
‘‘2023వ సంవత్సరంలో జరగనున్నమధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని, బీజేపీలో చేరాలని లేకుంటే మామా బుల్డోజర్ సిద్ధంగా ఉంది’’ అని మహేంద్రసింగ్ సిసోడియా చెప్పారు. మంత్రి వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్ఠను దిగజార్చాయని గుణ జిల్లా కాంగ్రెస్ చీఫ్ హరిశంకర్ విజయవర్గీయ మండిపడ్డారు.