రష్యా, ఉక్రెయిన్ ల మధ్య ఏర్పడిన యుద్ధం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే.. ఉక్రెయిన్ లో పాలమూరు జిల్లాకు చెందిన కొందరు వైద్య విద్యార్ధులు చిక్కుకున్నారు. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 18 మంది వరకు విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది.
ఉన్నత చదువుల కోసం పిల్లలను ఉక్రెయిన్ పంపిన తల్లిదండ్రులు.. ఒక్కసారిగా యుద్ధం మొదలు కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణం అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఫోన్ కాల్ లో అందుబాటులో ఉండగా.. మరికొందరి సమాచారం అందడం లేదని పేరెంట్స్ వాపోతున్నారు.
పెబ్బేర్ పట్టణానికి చెందిన దేవరపల్లి వినోద్ ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. అదే కుటుంబానికి చెందిన రాహుల్ కూడా ఉన్నత చదువుల కోసం వెళ్లి అక్కడే చిక్కుకున్నాడు. గత వారం రోజుల క్రితం రాహుల్ ఇండియాకి రావడానికి విమాన టికెట్ బుక్ చేయించుకున్నాడు. కానీ.. ఇంతలోనే యుద్ధ వాతావరణం ఏర్పడటంతో విమానాలు ఆగిపోయాయి.
దీంతో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. తమ బిడ్డలను సురక్షితంగా ఇండియాకు రప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమ పిల్లలతో ఫోన్ లో కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు కొందరు తల్లిదండ్రులు