జోషీమఠ్ లో ప్రమాదకరంగా మారిన హోటళ్లు, ఇళ్ల కూల్చివేతలు వివాదాస్పదంగా మారింది. . తమకు పరిహారం చెల్లించకుండా ఎలా కూలుస్తారని స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మలరి ఇన్, మౌంట్ వ్యూ అనే రెండు ప్రముఖ హోటళ్ల యజమానులతో సహా పెద్ద సంఖ్యలో ప్రజలు ధర్నాలకు కూర్చుంటున్నారు. బద్రీనాథ్ ధామ్ మాస్టర్ ప్లాన్ ప్రకారం తమకు మొదట పరిహారం చెల్లించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.
మా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, కానీ పరిహారం మాటేమిటని వారు అధికారులను నిలదీస్తున్నారు. దీనికి సంబంధించి స్పష్టమైన హామీ లభిస్తే తప్ప తాము నిరసనన విరమించబోమని హెచ్చరిస్తున్నారు. మలరి ఇన్, మౌంట్ వ్యూ హోటళ్లు రెండూ పగుళ్లతో ఒకదానికొకటి పక్కకు ఒరుగుతూ వస్తుండడంతో వీటిని మొదట కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు.
బుల్డోజర్లు, హెవీ మెషినరీతో ఉత్తరాఖండ్ అధికారులు రాగా.. ఈ హోటళ్ల యజమానులు, స్థానికులు అడ్డుకున్నారు. పరిహారంపై హామీ లభించనిదే ఇక్కడినుంచి కదలబోమని పేర్కొన్నారు. వీరి ఆందోళన ఫలితంగా బుధవారం స్థానిక నేతలు, అధికారులతో సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించారు. జోషీ మఠ్ లో దశలవారీగా కూల్చివేతలు సాగుతాయని, ఇందుకు మూడు,నాలుగు రోజులు పట్టవచ్చునని డా. కనుంగొ అనే సైంటిస్ట్ తెలిపారు. బుధవారం రాత్రి నుంచి కూల్చివేతలు ప్రారంభం కావచ్చునన్నారు.
తన కొడుకు ఫ్రాన్స్ లో ఉంటాడని, తానెక్కడికైనా పోవచ్చునని, కానీ ఇక్కడి ప్రజలకోసం తానూ, తన కుటుంబ సభ్యులం నిరసన పాటిస్తున్నామని మలరి హోటల్ యజమాని టి. సింగ్ రానా చెప్పారు. ఇక- 680 ఇళ్లను ప్రమాదకరమైనవిగా అధికారులు గుర్తించారు. వీటిపై అప్పుడే ఎర్ర పెయింట్ తో ఇంటూ మార్క్ వేశారు.