ఉత్తరాఖంఢ్ ఛమోలీ జిల్లాలోని జోషీమఠ్ ఇక పూర్తిగా కనుమరుగు కానుందా? భూమి లోపలికి కుంగిపోయి.. ఆనవాలు లేకుండా పోతుందా ? ఇలాంటి అనుమానాలకు, భయాందోళనలకు తావిస్తున్న శాటిలైట్ ఇమేజీలు వెలుగు చూశాయి. ఈ ఇమేజీలను ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విడుదల చేసింది. ‘కార్టోశాట్-2 ఎస్’ శాటిలైట్ తీసిన ఈ ఫొటోలు .. ఆర్మీకి చెందిన హెలిపాడ్, ఓ ఆలయంతో సహా మొత్తం టౌనంతా ..రేపో, మాపో కనుమరుగుకావచ్చుననే సంకేతాలిస్తున్నాయి. అత్యంత సెన్సిటివ్ జోన్లుగా అన్ని ప్రాంతాలు కనిపించాయి.
గత ఏడాది ఏప్రిల్-నవంబరు మధ్య కాలంలో భూమి మెల్లగా… 8.9 సెంటీమీటర్ల మేర కుంగిపోయినట్టు ఈ సంస్థ ఓ ప్రాథమిక నివేదికలో తెలిపింది. అయితే గత డిసెంబరు 27, ఈ ఏడాది జనవరి 8 మధ్య కాలానికి ఇది మరో 5.4 సెం.మీ. మేర కుంగిపోయిందట. కేవలం 12 రోజుల్లోనే నాటకీయంగా ఇలా జరిగిందంటే.. ఎంత త్వరగా ఈ ‘ముంపు’ సంభవిస్తుందో అంచనా వేయవచ్చునని ఈ నివేదిక పేర్కొంది.
కొండచరియలు విరిగి పడడం, అనేక చోట్ల భూమి నుంచి పైకి ఉబికి వస్తున్న నీరు, భారీ వర్షాలు, భూప్రకంపనల ఫలితంగా ఇక ఈ దేవభూమి ప్రకృతిలో కలిసిపోవచ్చునని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేబట్టిన పలు జల విద్యుత్ కేంద్రాలు కూడా ఇందుకు కారణమవుతున్నాయని వారిదివరకే పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి.. అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలోనే ఆయన ఆర్మీ,ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్, ఎండీ ఆర్ ఎఫ్ బృందాలతోను, సైంటిస్టులతోను కూడా తాజా పరిణామాలపై చర్చించారు. అలాగే పోలీసు అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో కూడా సమావేశమయ్యారు. ఇప్పటికే జోషీమఠ్ లో రెండు హోటళ్లు, అనేక ఇళ్లను కూల్చివేస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారికి ఒకటిన్నర లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.