ఉత్తరాఖండ్ లోని జోషీ మఠం ప్రమాదం అంచుల్లో పడుతోంది. ఇక్కడి దాదాపు 560 కి పైగా ఇళ్ళు , చివరకు రోడ్లు సైతం పగుళ్లు విచ్చాయి. ఏ క్షణంలో నైనా ఈ ప్రాంతం కుంగిపోవచ్చునన్న భయంతో అధికారులు రంగంలోకి దిగారు. అనేకమంది బాధితులను నైట్ షెల్టర్లకు తరలించారు. కొండ చరియలు విరిగి పడుతున్న కారణంగా కొన్ని హోటళ్లు కూడా దెబ్బ తింటుండడంతో బస చేసినవారిని ఖాళీ చేయిస్తుండడమే గాక.. టూరిస్టులు రాకుండా నిషేధించారు.
అక్కడక్కడా భూగర్భం నుంచి నీరు పైకి పెల్లుబుకుతుండడం పరిస్థితి తీవ్రతను చూపుతోందని గర్వాల్ డివిజనల్ కమిషనర్ సుశీల్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. జోషీ మఠ్ లో భూమి నుంచి శబ్దాలు కూడా వినబడ్డాయని స్థానికులు కొందరు తెలిపారు. భూప్రకంపనల కారణంగా ఇలా జరిగినట్టు భావిస్తున్నామన్నారు.
ఛమోలీ జిల్లాలోని ఈ ప్రాంతంలో ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులను చేపడుతుండడాన్ని నిరసిస్తూ ఇటీవల పెద్ద సంఖ్యలో స్థానికులు ప్రదర్శనలకు దిగారు. దీంతో హెలాంగ్-మార్వారీ మధ్య చార్ ధామ్ రోడ్డు వెడల్పు పనులను అధికారులు నిలిపివేశారు. వేలాది మంది బద్రీనాథ్ జాతీయ రహదారిని 58 గంటలపాటు దిగ్బంధం చేశారు.
ఇక్కడ జోషీ మఠ్-ఔలీ రోప్ వే పనులను, జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం ఆధ్వర్యంలో చేపడుతున్న 520 మెగావాట్ల తపోవన్-విష్ణు గడ్ హైడల్ ప్రాజెక్టును కూడా నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. ఈ భౌగోళిక ప్రాంతం సున్నితమైనదని, ఒకోసారి భూమి కంపించినట్టవుతుందని నిపుణులు పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి శనివారం జోషి మఠ్ ను సందర్శించనున్నారు.