నర్సింహా రెడ్డి
జర్నలిస్ట్
కావాలంటే క్వార్టర్ కి ఓ పది పెంచుకోండి.
రేషన్లో ఓ రెండు కిలోలు తగ్గించుకోండి.
మా బ్యాంక్ అకౌంట్ల నుంచి ఏదొక టాక్సని చెప్పి ఓ 100 కట్ చేసుకోండి.
పెట్రోల్ పై పదో పరకో పెంచుకోండి.
వాళ్ళని మాత్రం అలా నడవనివ్వకండి…?
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
చెప్పుల్లేని కాళ్లతో,
భుజాలపై బరువుల్తో,
జారిపోయిన గుండెల్తో,
కారిపోతున్న నెత్తుటితో,
దేశం “నడుస్తుంది”.
ఆ రోడ్లపై
ఈ ఎండలో
అన్నం లేక
పసి నోళ్ళకి
పాలు లేక,
ఆగే దిక్కు లేక
అడిగే హక్కూ లేక
ముక్కుకుంటూ
మూలుగుతూ
బతుకేదో
చావేదో
తేడా తెలియక,
పట్టాలపై
అలసి
సొలసి
లేవలేని
నిద్రపోతూ,
నిద్ర నటిస్తున్న
మీ కళ్ళ సాక్షిగా,
ఆ వలస దేహం
చావై నడుస్తుంది.
దేశం “నడుస్తుంది”
దేశం “నడుస్తుంది”
అవును “నా దేశం నడుస్తూంది…