నర్సింహ రెడ్డి
జర్నలిస్ట్
తెలంగాణకు మరో మహాత్మాగాంధీని అంటూ తనకు తానే కీర్తి ప్రతిష్టలు ఆపాదించుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని చూస్తోంటే నవ్వొస్తోంది. బాధా కలుగుతోంది. గాంధీతో పోల్చుకోవడాన్ని తప్పుబట్టలేం కానీ.. అంతటి మహానుభావుడితో పోల్చుకున్న వ్యక్తి నోటి నుంచి మంచి మాటలు రావాలని కోరుకోవడం ఎంత మాత్రమూ తప్పు కాదు. మహాత్ముడితో పోల్చుకున్న మరు నిమిషంలోనే.. ఆయన నోటి నుంచి అథమ స్థాయి మాటలు రావడం విచారాన్ని కలిగిస్తోంది. ముఖ్యమంత్రి పదవిని తన ఎడమ కాలు చెప్పుతో పోల్చి ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థను కేసీఆర్ అవమానించారు.
100 మంది ఎమ్మెల్యేలను తన చెప్పు, చేతల్లో పెట్టుకున్నంత మాత్రానా.. ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ తన ఎడమకాలి చెప్పుతో పోల్చడం రాజ్యంగాన్ని మాత్రమే కాదు, దాన్ని గౌరవంగా చూసే యావత్ రాష్ట్ర ప్రజలను అవమానించినట్టే. ఇంకా చెప్పాలంటే ఒక చెప్పులు కుట్టేవాడి పనిని, ఆత్మగౌరవాన్ని కూడా ఈ ముఖ్యమంత్రి కించపరిచినట్టే. నిజంగా ముఖ్యమంత్రి పదవి ఎడమ కాలి చెప్పు అని కేసీఆర్ భావిస్తుంటే.. ఆ పదవిలో ఉన్న కేసీఆర్‌ని దేనితో పోల్చాలి..? ఏమని సంబోధించాలో చెప్పాల్సిన అవసరం కూడా కచ్చితంగా ఉంది. ఇక తెలంగాణ కోసం జీవితాన్ని ధారపోశానని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రికి.. ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు తన ఎడమకాలి చెప్పును దానం చేసే ధైర్యం రాకపోవడం విడ్డూరం కాదా. ఒక తెలంగాణ జాతిపిత ఎడమ కాలి చెప్పుపై కూర్చోవడం ఈ రాష్ట్రానికి చాలా అవమానం. బంగారు తెలంగాణ కోసం శ్రమిస్తున్న వ్యక్తి తక్షణమే ఆయన ఆ ఎడమ కాలు చెప్పును వదిలేసి, తన ఇంట్లోనే ఓ బంగారపు సింహాసనాన్ని చేయించుకుని కూర్చోవాల్సిన అసవరం ఉంది.
ముఖ్యమంత్రి పదవిని పవిత్రమైన బాధ్యత అనుకునేవారికి మాత్రమే అందులో కూర్చునే అర్హత ఉంది. దాని విలువ ఎడమ కాలి చెప్పు అనుకుంటున్న కేసీఆర్.. తక్షణమే ఆ పదవి నుంచి వైదొలగాలి. మరో నిమిషం కూడా అందులో కూర్చుండటానికి ఇంకేమాత్రం ఆయన అర్హుడు కాదు.. అయినా ఒక దేశ ప్రధానినే చెప్రాసీతో పోల్చిన వ్యక్తికి.. ముఖ్యమంత్రి పదవి చెప్పుగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు.