నర్సింహా రెడ్డి
జర్నలిస్ట్
ఏ వస్తువు ధర పెరిగినా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, నిరసన వస్తుంది. ప్రభుత్వాలను దుమ్మెత్తిపోస్తారు. ధరలు పెంచాలి అంటే ప్రభుత్వాలు కూడా భయపడుతాయి, కానీ మద్యం ధరలు మాత్రం విపరీతంగా పెంచుతూపోతారు, అదేదో తమ ఘనకార్యంగా గర్వంగా చెప్పుకుంటాయి ప్రభుత్వాలు. మద్యం ధరలు పెరిగితే ప్రజలు తాగడం మనేస్తారు అని బుద్దిలేని స్టేట్మెంట్ ఇస్తారు. ప్రభుత్వాలకు ఆదాయం పెరగాలి కాబట్టి వాళ్ళు ఎన్ని మాయమాటలైనా చెప్తారు. మద్యం ధరలు పెంచడానికి ప్రభుత్వాలు సహేతుకత లేని కారణాలు చెప్తూ విచ్చలవిడిగా మద్యం ధరలు పెంచి మధ్యతరగతి వాడిని నిండా దోచుకుంటున్నాయి.
గతం లో బీరు ధర 60 రూపాయలు ఉండేది, అది ఇప్పుడు దాదాపు 200 అయ్యింది. అంటే మూడొంతుల ధర పెరిగింది, అప్పట్లో వైన్ షాప్స్ దగ్గర నిలబడి మందు కొనాలి అంటే ఇబ్బంది గా ఫీల్ అయ్యేవారు, ఎక్కడో చీకట్లో కూర్చొని ఎవరికి కనబడకుండా తాగేవాళ్ళు. ఇప్పుడు చిరంజీవి సినిమాకు థియేటర్ ముందు టికెట్ల కోసం క్యూ ఉన్నట్లు మద్యం షాపులు ముందు క్యూ ఉంటుంది. ధరలు పెరిగితే మద్యం మానేస్తారు అనే ప్రభుత్వ లాజిక్ నిజమే అయితే, ప్రస్తుతం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీరు అనేది ఉండేది కాదు. తాగే వాళ్ళు గణనీయంగా తగ్గేవాళ్లు కదా.. కానీ ఒక సర్వే ప్రకారం అప్పటికి ఇప్పటికి వాటి అమ్మకాలు వందల రేట్లు పెరిగాయి, ప్రభుత్వాలకు ఆదాయం కూడా అదేస్థాయిలో పెరిగింది. ధర పెరిగింది కదా అని తాగడం ఎవరు మానలేదు సరికదా తాగడం పెరిగింది. కాబట్టి ప్రభుత్వాలు చెప్తున్న దిక్కుమాలిన లాజిక్కులు సుద్ద అబద్దం. కేవలం తమ జేబులు నింపుకోవడానికి చెప్తున్న బుడబుడకల మాటలు.ప్రభుత్వాలకు నిజంగా ప్రజాలమీద ప్రేమ ఉంటే మద్యం వల్ల జరిగే నష్టాలపై ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చిత్తశుద్ధితో అమలు చేయండి. మందు బాటిల్ పై ఏదో ఒక మూలన చిన్నగా మందు తాగడం ఆరోగ్యానికి హానికరం అని రాయించిన మీరే గల్లి గల్లీకి మందు దుకాణాలు ఓపెన్ చేశారు, మీది ప్రజల మీద ప్రేమ కాదు దోచుకునే గుణం.
ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా మద్యం ధరలు పెంచడానికి ముమ్మాటికీ ప్రజలే కారణం. మద్యం హానికరం అది వంద శాతం నిజం. మద్యం వల్ల చాలా కుటుంబాలు నాశనం అయ్యాయి ఇది వాస్తవమే. కానీ అది సంఘవ్యతిరేక పని కాదుగా, ప్రభుత్వాలే దగ్గరుండి మరి మందు తాగిస్తున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా, మరి కొన్ని రాష్ట్రాల్లో పరోక్షంగా ప్రభుత్వాలే మందు అమ్ముతున్నాయి. అలాంటప్పుడు సంఘవ్యతిరేక పని ఎలా అవుతుంది. మందు కూడా మన నిత్యావసర జీవితంలో ఒక భాగం అయిపోయింది. కానీ ఇప్పటికీ సమాజంలో మందు బాబులను అంటారానివాడిగా చూస్తారు,అదేదో పెద్డ నేరంగా తాగేవాడు వేరే గ్రహం వాసిగా చూస్తున్నారు. ఇలా చూస్తున్నవాళ్ల కుటుంబాల్లో కూడా మందు తాగే వాళ్ళు ఉంటారు. ఇదే ప్రభుత్వాలకు మనం ఇస్తున్న అవకాశం. మద్యం ధరలు పెంచితే ఎవరు రోడ్డు మీదికి వచ్చి ఆందోళన చేయరు, ఎందుకంటే సిగ్గు, ప్రతిపక్షాలు అడిగితే, మద్యం ధరలు పెంచితే అడుగుతారా, తాగుబోతులకు బాగైంది అని సంతోషించే వాళ్ళు తమ ఇంట్లో కూడా తాగేవాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇల్లు కూడా గుల్లవుతుంది అనే విషయాన్ని మర్చిపోతారు. సెక్స్ గురించే స్కూల్ లో పాఠాలు చెప్పాలి అని అడుగుతున్నప్పుడు, మందు గురించి పోరాటాలు చేస్తే తప్పేంటి. మందు అనేది మన జీవనశైలిలో ఒక భాగం అని ప్రజలు భావించినప్పుడే ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచడం ఆపేస్తాయి.
ఇక్కడ స్వయంప్రకటిత సంఘసేవకులను నేను ఒక్కటి అడుగుతున్న. ప్రజలకు నీళ్లు కూడా సరఫరా చేయని ప్రభుత్వాలు పోలీస్ లను పెట్టి మద్యం అమ్మిస్తుంటే ప్రభుత్వాలను ఒక్కమాట అనకుండా వైన్ షాప్స్ ముందు ఉన్న ప్రజలను తాగడానికి వచ్చావా నీకు సిగ్గు లేదా అని ప్రశ్నిస్తున్నారు. సిగ్గు అనేది ఉంటే ప్రభుత్వాలకు ఉండాలి, 45 రోజులు మద్యం లేకుండా అదే ప్రజలు ఉన్నారు గా, సిగ్గు లేని ఈ ప్రభుత్వాలే కదా మళ్ళీ వైన్ షాప్స్ తెరిచి దగ్గరుండి తాగిస్తున్నాయి. అదేదో వైన్ షాప్స్ ముందు చూపే మీ సమాజ ప్రేమలో కాస్త ప్రభుత్వాలను ప్రశ్నించే దాంట్లో చూపించండి. ఏరోజైతే మద్యం పై సమాజంలో ఉండే దురాభిప్రాయం పోతుందో, ఏరోజైతే మద్యం ధరలు పెరిగితే ప్రజలు రోడ్డు మీదికి వచ్చి ఆందోళన చేస్తారో ఆరోజు నుంచే ప్రభుత్వాలు ధరలు పెంచడానికి భయపడుతాయి.అన్నింటికంటే ముఖ్యంగా ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా ఎంచుకోవడం మానేస్తాయి.