జర్నలిస్ట్ రఘు
అప్పుడు నల్ల ధనాన్ని రూపుమాపడానికి అంటూ పెద్ద నోట్ల రద్దు ను తెర మీదకు తెచ్చారు. ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు దేశమంతా లాక్ డౌన్ విధించారు. ఈ రెండింటిలో బలవుతున్నది పేదోడే. తిండికి దిక్కు లేక కాటికి కాలు చాపిన పేదోడే. ఈ రెండు నిర్ణయాలు ఆయా సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలే కావొచ్చు. ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో తీసుకున్న నిర్ణయాలే కావొచ్చు. కానీ నిర్ణయం తీసుకునే ముందు దాని పర్యవసానాలు ఏంటో కనీసం పట్టించుకోక పోవడం దారుణం,దుర్మార్గం.
పెద్ద నోట్ల రద్దు సామాన్యుడి జీవితాలను అతలాకుతలం చేసింది. చాలా మంది కార్మికులు, కూలీలు పని దొరక్క పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.ఇక్కడ బలయ్యింది బలిసినోడు కాదు, బక్క చిక్కినోడు.మధ్య తరగతి కుటుంబాలు ఎండలో , ఏటీఎమ్ లముందు నిల్చొని ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా చూశాం. డబ్బున్నోడు, నిర్ణయాలు తీసుకొని, అమలుపరిచిన వాళ్ళు హాయిగా ఎసి గదుల్లో విశ్రాంతి తీసుకున్నారు.పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తప్పా, రైటా వదిలేద్దాం, కానీ దాని కారణంగా కష్టాలు పడ్డ పేదోడి జీవితం గురించి మనం ఆలోచించామా?
ఇక ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరిచే విధానం కూడా అలాంటిదే. కరోనా అనే మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే కచ్చితంగా గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. లాక్ డౌన్ చేయడం కూడా సరైన నిర్ణయమే కానీ, దాని పర్యవసానాలు ప్రభుత్వాలు ఆలోచించాయా ? కనీసం కూడా ఆలోచించలేదు. వైరస్ చంపడం తరువాత, ఆకలితో చనిపో యేలా ఉన్నామని వలస కూలీల రోదన అరణ్య రోదన గానే మిగిలిపోతోంది. వేలాది వలస కూలీ తల్లులు సంకలో పసిబిడ్డను ఎత్తుకొని, నెత్తి మీద బట్టల మూటలతో వందల కిలో మీటర్లు కాలినడక ఎర్రటి ఎండలో నడుస్తుంటే ఏమని మాట్లాడాలి. కళ్లు లేని ఈ ప్రభుత్వాలకు నిర్ణయాలు తీసుకునే ముందు కనీస అవగాహన ఉండదా? ఢిల్లీ నుండి జార్ఖండ్, బీహార్, ఉత్తర ప్రదేశ్ కు కాలి నడకన సొంత వూరికి వెళ్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి .అంతెందుకు మన హైదరాబాద్ నుండి పశ్చిమ బెంగాల్ కు, బీహార్ కు కాలి నడకన వెళ్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మీ బతుకులు ఇంతే , మీరు ఇలాగే బతకాలి లేదంటే చావల్సిందే అని ప్రభుత్వాల వైఖరి కనిపిస్తోంది. ముమ్మాటికీ ప్రభుత్వాలది ఇదే వైఖరి.విదేశాల్లో కరోనా బారిన పడకుండా ప్రత్యేక విమానాల ద్వారా రప్పించిన చిత్తశుద్ది, వలస కూలీల విషయంలో ఏమైంది? వందల కోట్లు పెట్టీ విమానాలు ఏర్పాటు చేసిన మీరు, ఈ కూలీలకు ఒక దగ్గర వసతి ఏర్పాటు చేసి తిండి కూడా పెట్టలేరా? సాధ్యం కాక కాదు, చేయాలన్న ఆలోచన వీరికి లేదు. మరి మీకు మమ్మల్ని పాలించే అర్హత ఉందా? ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించుకోవాలి. రాష్ట్రాలు రాజకీయం చేసేటప్పుడు కేంద్ర జోక్యం ఎక్కువైంది అంటారు. మరి మీ జోక్యంతో రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలను కాపాడాలనే సోయి మీకెందుకు రావట్లేదు. అందరూ ఒకే తాను ముక్కలే.
ఇక మీడియా కూడా ఎంతమందికి వ్యాధి సోకింది, ఎందరు చనిపోయారు ఈ లెక్కలు తప్పితే ఈ సామాన్యుడి గురించి, ఆకలితో అలమటిస్తున్న వలస కూలీ గురించి వార్తలు రాసే సమయం వారికి లేదు. ఆ కూలీల గురించి మాట్లాడితే, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలి. అది ఈ దేశంలో, మన రాష్ట్రాల్లో ఉన్న మీడియాకు అంతా సీన్ లేదు.ఎందుకంటే మీడియా మొత్తం ప్రభుత్వాల నిర్బంధం లో ఉంది కాబట్టి.
ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి వలస కూలీలు ఆకలితో చావకుండా చర్యలు తీసుకోవాలి.