ఉద్యమద్రోహులకు కౌగిలింతలు.. ఉద్యోగులకు ఊస్టింగులా..? - Tolivelugu

ఉద్యమద్రోహులకు కౌగిలింతలు.. ఉద్యోగులకు ఊస్టింగులా..?

బాలు సురమోని

కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను స్వామీజీలకు, పీఠాధిపతులకు కేవలం రూపాయి, రెండు రూపాయలకి కట్టబెట్టిన కేసీఆర్ గారు ఆర్టీసీకి ఇవ్వవలసిన బకాయిలు ఇవ్వడానికి నిధులు లేవు అనడం విడ్డూరంగా ఉంది.
శారదా పీఠాధిపతి, చిన్న జీయర్ స్వామీజీలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? మరి వారికి ప్రభుత్వ భూములను అంత చవక ధరకు అమ్మడం ఎందుకు?
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికుల మీద కన్నెర్రజేస్తారు, ఉద్యమద్రోహులకు మాత్రం కౌగలింతలా?
దసరా పండగ అప్పుడే సమ్మె గుర్తుకు వస్తాదా అని TRS నాయకులు అంటున్నారు, మరి మీకు ఎన్నికలప్పుడే అభివృద్ధి, సంక్షేమం గుర్తు వస్తాదా. బతుకమ్మ పండుగకు మాత్రమే మహిళలు గుర్తుకు వస్తారా? క్రిస్మస్, రంజాన్ పండుగలప్పుడే క్రైస్తవులు, ముస్లింలు గుర్తుకు వస్తారా?
ఆర్టీసీ కార్మికులు తమ ఉద్యోగాలని లెక్క చేయకుండా సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు అప్పుడు మీరే వారిని అందలం ఎక్కించారు ఇప్పుడు సమ్మె చేస్తే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకలా?
ఇప్పటివరకు ఆర్టీసీకి చైర్మన్, ఎండీలు గతి లేరు. ఇంచార్జ్ ఎండీగా సునీల్ శర్మ వ్యవహరిస్తున్నారు.
లోటు బడ్జెట్‌తో ఏర్పడిన APలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నారు మరి మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయలేదు.
గత నెల జీతం ఇప్పటివరకు కార్మికులకు అందలేదు.సమ్మె చేస్తుండడం వల్ల జీతం ఇవ్వం అంటున్నారు. అంటే వారి హక్కుల కోసం,ఆర్టీసీ పరిరక్షణ కోసం సమ్మె చేయడం తప్పా? మరి ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులను సమ్మెలోకి ఎందుకు తీసుకున్నారు? అప్పుడు ప్రజల కష్టాలు గుర్తు రాలేదా.
ఎస్మా ప్రయోగిస్తే భస్మం అయ్యేది మీ పార్టీయే.
డిస్మిస్ చేస్తామని హెచ్చరించినా కార్మికులు భయపడలేదు.ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన గడువు నిన్న సాయంత్రానికి ముగిసింది అయినా కార్మికులు విధులకు రాలేదు. ఏదో చేస్తామని ప్రగల్భాలు పలికిన మీరు సమీక్ష సమావేశాన్ని ఎందుకు వాయిదా వేశారు? భయపడ్డడి మీరా? కార్మికులా?
కార్మిక సంఘాలతో చర్చల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయకుండా అధికారులతో కమిటీ వేయడం ఏంటి. ఆ కమిటీలో రవాణా, ఆర్టీసీ మంత్రి లేకపోవడం ఏంటి?
సమ్మె గురించి ఉద్యమ నాయకులు కేటీఆర్, హరీష్ రావు ఎందుకు స్పందించట్లేదు? ఉద్యమ ద్రోహులు ఎర్రబెల్లి, తలసాని చేత ఎందుకు మాట్లాడిస్తున్నారు?
దసరాకు సింగరేణి కార్మికులకు బోనస్ ఇస్తున్నారు కానీ ఆర్టీసీ కార్మికులకు కనీసం గత నెల జీతం ఎందుకు ఇవ్వడం లేదు?
కొత్త బస్సులు కొనాలని ఎప్పటినుంచో కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త బస్సులు కొనడానికి డబ్బులు లేవు అని దాటవేస్తున్నారు మరి కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం డబ్బులు ఉన్నాయా? ప్రగతి భవన్ కట్టడానికి డబ్బులు ఉంటాయా?
గతంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగిస్తామని బెదిరించి విధులకు హాజరు అయ్యేలా చేశారు, కానీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఎస్మాకు బెదరకుండా సమ్మెలో ఉన్నారు.
త్వరలో విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు.
తొలి, మలి దశ ఉద్యమాల్లో స్వరాష్ట్రం తెలంగాణ కోసం పోరాడిన ప్రజలు,ఉద్యోగులు,విద్యార్థులు,ఉద్యమకారులు, మేధావులు ఇప్పుడు ఆత్మ గౌరవ తెలంగాణ కోసం పోరాటం చేయడానికి సిద్ధం అవుతున్నారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగి ప్రజా ఆమోదం మేరకు పాలన కొనసాగిస్తే బాగుంటది,లేదా ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు.

జై తెలంగాణ

Share on facebook
Share on twitter
Share on whatsapp