సతీష్ కమాల్
సాధారణ జర్నలిస్టు
గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దయచేసి మీరు గమనించాలి.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆరేళ్ళ మీ పాలనలో వ్యవస్థలన్నీ ఎలా అస్తవ్యస్తం అయ్యాయో ఏ రోజైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా…? చెప్పుకుంటె సిగ్గుచేటు.ప్రతి విషయంలో… ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి హోదాలో మీ నిర్లక్ష్యం తెలంగాణలో ప్రభుత్వం… పాలన వ్యవస్థలను నిర్వీర్యం చేశాయి.మీ దొరతనపు అహంకారంతో పాలకుల్లో ఉండాల్సిన జవాబుదారీతనాన్ని నిలువునా ఖూనీ చేశారు.మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే మీ అనుచరగణం తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజానీకాన్ని గంజిలో ఈగల కంటే హీనంగా చూస్తున్నారు.ఎన్నికల సమయంలో 500 నోట్లకు,లిక్కర్ కు ఓట్లను అమ్ముకున్న జనానికి ఈ శాస్తి జరగాల్సిందే అన్నట్టుగా ఉంది రూలింగ్ పార్టీ వ్యవహారశైలి.
తాజా ఉదాహరణ కావాలంటే మీ ప్రభుత్వ యంత్రాంగంలో ఒకరిగా ఉన్న వెటర్నరీ డాక్టర్ ప్రియాంక హత్యోదంతాన్ని తీసుకొండి.అడుగడుగునా సెన్సిటివిటీ లేని…సెన్సిబిలిటీస్ కోల్పోయిన మీ సర్కార్ తోలుమందం వ్యవహారం గాయపడిన తెలంగాణ సమాజం పుండు మీద కారం చల్లుతోంది.Very sorry to say తెలంగాణ పోలీసులు మీ హయాంలో పోలీసులుగా కాకుండా మీ పార్టీ కార్యకర్తలుగా ఉండడానికే అలవాటుపడ్డారు.తెలంగాణ పోలీసుల ఈ యాటిట్యూడ్ మూలంగా రాష్ట్రంలో పోలీసింగ్ అనేదే లేకుండా పోయింది.ఎందుకంటే పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకునే తెలంగాణ పోలీసులు తమ కూతురు కనిపించడం లేదని వచ్చిన తల్లిదండ్రులతో శాఖాపరమైన పరిధుల గొడవ సమస్యను సాకుగా చూపి ఫిర్యాదు తీసుకోరా…? జీరో FIR గురించి సామాన్య జనాలకు అవగాహన ఉండకపోవచ్చు కానీ మీ పోలీసులకు కూడా లేదా…? అరె…ఎవరైనా తప్పిపోయారని తెలిస్తే అయ్యో అని కనీస మానవత్వంతో స్పందిస్తారే…అలాంటిది “ఎవడితోనో లేచిపోయి ఉంటుందనే” నీచపు మనస్తత్వాన్ని ప్రదర్శించడం పోలీసు యంత్రాంగంపు దిగజారిన దుస్థితికి నిదర్శనం. ప్రియాంక మిస్సింగ్ కంప్లైంట్ రాగానే విధుల్లో ఉన్న తమ సిబ్బందితో పాటు చుట్టుపక్కల పోలీసు స్టేషన్లు, హైవే పెట్రోలింగ్ బాధ్యులను అప్రమత్తం చేసి రంగంలోకి దించగలగితే ఫలితం ఎలా ఉండేది..?పోలీసు సైరన్లతో పెట్రోలింగ్ వాహనాలు ఆ ప్రాంతంలో తిరిగినా ఆ మానవ మృగాలు భయంతో ప్రియాంకను వదిలేసేవేమో…? పోలీసులు సైతం పోలీసింగ్ కు దూరమైన పరిస్థితులలో ప్రజలను పోలీసింగ్ లో భాగస్వాములను చేస్తారనుకోవడం అత్యాశే అవుతుంది.
అయ్యా…డిప్యూటీ CM కమ్ హోం మంత్రి మహమూద్ అలీ సాబ్ మీరేమంటారు సార్…100 కు డయల్ చేస్తే ఘనమైన మీ పోలీసు యంత్రాంగం ప్రియాంకను కాపాడేవారా…? MIM పార్టీ వాళ్ళు మీ ఇంట్లో దూరి మరీ మీ కొడుకును కొడ్తే మీరు ఏం చేశారు…? ఏం చేయగలిగారు…? మీ ఇంట్లో మీ కొడుకు పై MIM దాడికి సంబంధించిన కేసు ఏమైందో చెప్పగలరా..? అసలు 100 నంబర్ కు కాల్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా…కనీసం పోలీస్ స్టేషన్ల పేర్లు తెలీని వారు అక్కడ ఉంటారని మీకు తెలుసా…? జనాలకు చెప్పే ఈ సుద్దులేవో కనీసం నెలకో,ఆర్నెల్లకో,ఏడాదికో ఒకసారైనా మీ పోలీసులకు చెప్పండి సార్… ప్రజల సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్న ప్రొటోకాల్ కు న్యాయం చేయండి.
CM KCR కు BC కట్టప్ప లాంటి తలసాని శ్రీనివాస యాదవ్ క్రమంగా ముఖ్యమంత్రి దొరతనాన్ని ఆవాహన చేసుకుంటున్నారు. గతంలో వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వెటర్నరీ విద్యార్థులను కలవడానికి నిరాకరించడమే కాకుండా వారిని పోలీసులతో కొట్టించారు. ప్రియాంక ఘటన తర్వాత సున్నితంగా స్పందించాల్సిన సందర్భంలో ఇంటికో పోలీసును పెట్టడం సాధ్యమేనా అంటూ ముఖ్యమంత్రి KCR ను తల్చుకుని మోహన్ బాబు తరహాలో ఎటకారపు డైలాగులు కొట్టారు. ఇక మీరు మారరా శీనన్నా…?
మీరు చురుకుగా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్న దురవస్థను అధిగమించి మీ రాజకీయ వారసుడిగా ఎస్టాబ్లిష్ చేయడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కిరీటాన్ని కట్టబెట్టిన KTR ను కూడా కీలుబొమ్మగా మార్చడమొక విషాదం. మీ ఆంక్షలతో…నియంత్రణలతో ఆఖరికి చురుకైన నాయకుడు KTR కూడా పక్క రాష్ట్రపు లోకేష్ లాగా ట్విట్టర్ కూతలకే పరిమితమైపోయారు.
నందమూరి హరికృష్ణ చనిపోతే ఆగమాగమై పోయి మీరు ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకోండి.తెలంగాణకు తండ్రిగా క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా…మరి ప్రియాంక అనే మీ కూతురు విషయంలో ఎందుకు బాధ్యతగా వ్యవహరించలేకపోతున్నారు…? మీ కాన్వాయ్ బండ్ల డీజిల్ ఖర్చు… పోలీసు భద్రత ఖర్చు అంతా కూడా జనం సొమ్ము నుంచే ఖర్చు చేస్తారు…మీకు నయాపైసా ఖర్చు రాదు…నెలకో సారి ప్రగతిభవన్ నుంచి రాజ్ భవన్ సందర్శించడమే కాకుండా ఇటువంటి బాధాకర సందర్భాలలో బాధితులను కూడా పరామర్శించండి.దీనివల్ల మీలో గుండె తడి పెరుగుతుంది తప్ప మీకు వచ్చే నష్టమేమీ ఉండదు. ఇప్పుడు కూడా ప్రజలకు మీరు అందుబాటులో ఉండకపోతే మీకా ముఖ్యమంత్రి పదవి అవసరమా…?
సతీష్ కమాల్
సాధారణ జర్నలిస్టు