సతీష్ కమాల్
సాధారణ జర్నలిస్టు
“ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా…?” అనే సామెత KCR సర్కార్ కు చక్కగా సరిపోతుంది.ప్రజాస్వామ్యంలో ఇంత జవాబుదారీతనం లేని ప్రభుత్వాన్ని చూస్తామని తెలంగాణ ప్రజలు ఊహించి ఉండకపోవచ్చు. దశాబ్దాలుగా KCR వ్యవహారశైలిని చూసిన వాళ్ళు మాత్రం KCR నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించడం ప్రజల తప్పు అవుతుంది తప్ప KCR ది ఎంతమాత్రం కాదనే చెప్తారు.గడీల దొరల అహంభావం KCR లో ఏదో ముఖ్యమంత్రి అయ్యాక కొత్తగా వచ్చింది కాదని…మొదటి నుంచి ఆయన స్వభావమే అలా ఉండేదని “ఆర్కైవ్స్” ను తిరగేస్తే సులువుగా అర్థమవుతుంది.ఇటీవల చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను పరిశీలించినా KCR లో ఈ అహంభావ ధోరణి ముఖ్యమంత్రి అయ్యాక మరింత పెరిగిందని స్పష్టమవుతుంది.సభానాయకుడి హోదాలో అసెంబ్లీ వేదికపై ప్రతిపక్ష సభ్యులను హేళన చేసిన సందర్భంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి YSR కు ఏమాత్రం తీసిపోలేదు.”ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇస్తామన్నారు కదా అని అడిగిన ప్రజలకు “మీ అయ్యకు కూడా జవాబిస్తా…కూర్చో” అంటూ బహిరంగ సభల్లో ప్రజలకు “ధమ్కీ” ఇచ్చిన దొరతనాన్ని కూడా తెలంగాణ గడ్డ చూసింది. ప్రభుత్వ పాలన లోపాలను ప్రశ్నించిన జర్నలిస్టులపై ఈ స్థాయి రుబాబ్ చేసిన ముఖ్యమంత్రి KCR తప్ప మరొకరు లేరు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ముఖ్యమంత్రులు “ఒక లైన్” దాటి వ్యవహరించినపుడు బాయ్ కాట్ నిరసనలతో వాళ్ళకు వాళ్ళ స్థానం…మీడియా స్థానాలేమిటో తెలిసొచ్చేలా చేసిన సందర్భాలు తెలుగునాట ఉన్నాయి. ఆఖరుకు ఈ జవాబుదారీతనపు లేమితో ముఖ్యమంత్రి స్థాయి మనిషి నోటిదురుసు ఎంత వరకు పోయిందంటే…ఒక బహిరంగసభలో ప్రధాని గురించి “మోదీ గాడు” అనడం అప్పట్లో రాజకీయ రచ్చకు దారితీసింది.
ముఖ్యమంత్రి KCR యాటిట్యూడ్ ను ప్రేరణగా తీసుకున్నాడో ఏమో కానీ చైతన్యపురి పోలీస్ ఇన్స్ పెక్టర్ జానకిరాంరెడ్డి అదే రేంజ్ లో రెచ్చిపోయాడు.”మోడీ గాడు” నుంచి మొదలెట్టి అమ్మ నా బూతులతో విరుచుకుపడ్డాడు.ఈ పోలీసోడు ఇంతలా రెచ్చిపోయింది ఎవరో సంఘ విద్రోహకశక్తుల మీద కాదు పండించిన పంటను అమ్ముకోవడానికి వచ్చిన రైతుల మీద తన ప్రతాపాన్ని చూపాడు.స్థానిక MLA సుధీర్ రెడ్డి కి,DGP మహేందర్ రెడ్డికి బంధువుగా చెప్పుకునే జానకిరాంరెడ్డి రైతులపై నోరు,చేయి చేసుకున్నా చర్యలు తీసుకునే ధైర్యం రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ కు ఉంటుందా…? రైతుల పక్షాన నిలబడి మాట్లాడిన నాగర్ కర్నూల్ బిజెపి నాయకుడు సుధాకరరావుపై CI జానకిరాంరెడ్డి తప్పుడు కేసు బనాయించాడు.అలాంటప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రైతులపై దౌర్జన్యం చేసిన CI జానకిరాంరెడ్డి పై క్రిమినల్ కేసు ఎందుకు పెట్టకూడదు…? CI జానకిరాంరెడ్డి పై సస్పెన్షన్ లాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్న పెద్దమనుషులెవరు…?
Mr జానకిరాంరెడ్డి నీ మైండ్ లో గట్టిగా ఫీడ్ చేసుకో…నీలో క్రౌర్యాన్ని నింపిన ఆ ఖాకీ యూనిఫామ్ నీ ఒంటి మీదికి రావడం వెనుక నువ్వు దౌర్జన్యం చేసిన ఆ రైతులు ఇచ్చిన ఒక్కొక్క రూపాయి కష్టార్జితం కూడా ఉంది.నీ భార్యాపిల్లలు,నీ కుటుంబం పొందుతున్న గౌరవప్రదమైన జీవితానికి పన్నుల రూపంలో ప్రజలు చెల్లిస్తున్న పైసలున్నాయని మర్చిపోవద్దు.ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో…ఆ యూనిఫామ్ తీసేస్తే నీ బతుకు ఎలా ఉంటుందంటావ్…? నీకు యూనిఫామ్ ఇచ్చి…సమాజంలో ఒక ఉన్నతమైన స్థానమిచ్చి గౌరవించుకుంటున్న ప్రజల పట్ల ఎంత కృతజ్ఞతతో ఉండాలి నువ్వు…? MLA సుధీర్ రెడ్డి,DGP మహేందర్ రెడ్డి ల బంధువుగా చెప్పుకుంటున్నపుడు ఇంకెంత బాధ్యతాయుతంగా ఉండాలి నువ్వు…?
ప్రభుత్వ సారథి దగ్గర లేని జవాబుదారీతనాన్ని ఒక పోలీస్ ఇన్స్ పెక్టర్ స్థాయిలో ఆశించడం అత్యాశే అవుతుందేమో…?