ఉద్యమాల నుండి వచ్చిన వారు జర్నలిస్టుల ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యవహార శైలీపై జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రతి ప్రెస్ మీట్లో కేసీఆర్ ఎవరో ఒకరు మీడియా ప్రతినిధిని బెదిరిస్తూనే ఉన్నారు. తనకు నచ్చని ప్రశ్నలు అడిగినా… గుచ్చి గుచ్చి ప్రశ్నించే ప్రయత్నం చేసినా ఎదురుదాడి మొదలైపోతుంది.
ఇది సీఎం కేసీఆర్ కు కొత్తేమీ కాదు. జర్నలిస్టులపై మొదటి నుండి తను బెదిరింపు ధోరణితోనే ఉన్నారు. తను అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ప్రభుత్వాలపై విష ప్రచారం చేస్తే 10కి.మీ లోపల బొందపెడుతానంటూ హెచ్చరించారని, ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుందని పాత్రికేయ సంఘాలు, సీనీయర్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వైరస్ ఇష్యూతో కేసీఆర్ మీడియా ముందుకు రావటం కాస్త పెరిగింది. వలస కార్మికులపై ప్రశ్నించినందుకు ఏం చేయమంటావ్ మరీ, నీకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరూ…? నీది ఏ పేపర్ అంటూ జర్నలిస్ట్ పై బెదిరింపు ధోరణితో వ్యవహరించారు. ఇక సెంట్రల్ ఫండ్ పై ప్రశ్నించిన మరో జర్నలిస్టుపై కూడా ఇదే అసహనాన్ని ప్రదర్శించి, మీడియా ప్రతినిధులందరినీ హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఇక పీపీఈ కిట్స్ అందుబాటులో లేవంటూ ఓ పేపర్ వార్త రాసినందుకు బెదిరించటమే కాదు కేసులు పెడతామని, మీకు కరోనా వస్తుందంటూ శాపనార్థాలు పెట్టారు కేసీఆర్. తాజాగా ఏపీ-తెలంగాణల మధ్య నడుస్తున్న వాటర్ వార్ పై జర్నలిస్ట్ ప్రశ్నిస్తే నీ ఉద్దేశం అర్థమయ్యింది, కేసీఆర్ ను తట్టుకోలేవు… వద్దు బ్రదర్ అంటూ గట్టిగానే హెచ్చరించారు.
జర్నలిస్టు సంఘాలు, సంఘాల ప్రతినిధులంతా దీనిపై మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ ను ప్రశ్నలు అడిగే అవకాశమే లేదని, తనకు వ్యతిరేకంగా ఒక్క ప్రశ్న అడిగినా మండిపడటం సరికాదని స్పష్టం చేస్తున్నారు. ఈ ధోరణి మంచిది కాదని, ప్రజాస్వామ్యంలో పారదర్శకత అవసరం అని, అందుకు మీడియా కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేస్తున్నారు.
ఇక తెలంగాణలో సీఎం ఇలాంటి చర్యలకు పాల్పడటంపై సీపీజే(కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్) ఖండించింది. ప్రశ్నలు అడగటం, సమాచారాన్ని ప్రజలకు చేరవేయటం జర్నలిస్టుల వృత్తి. అది వారి ఉద్యోగం. కానీ ప్రభుత్వాలే ఇలా చేయటం మంచిది కాదు… పత్రికా స్వాతంత్ర్యాన్ని గౌరవించాలని సీపీజే-ఆసియా రిసెర్చర్ అలియా ఇఫ్తికర్ సూచించారు.