ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటిస్తూ సహకరించాలని ప్రభుత్వాలు, అధికారులు మొరపెట్టుకుంటున్న అధికార గర్వంతో వారి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. తాజాగా నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి వెయ్యి మందితో అట్టహాసంగా జన్మదిన వేడుక నిర్వహించిన ఉదంతాన్ని మీడియా ప్రతినిధి పరమేశ్వర్ వెలుగులోకి తెచ్చారు. దీనితో అతనిపై కక్ష్యగట్టి దౌర్జన్యంగా ఇంటి నిర్మాణాన్ని కూల్చివేశాడు. ఈ చర్యను జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
లాక్ డౌన్ ను విజయవంతంగా అమలు చేయాలని ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిస్తుండగా, మరోవైపు ఇలాంటి ఆర్భాటాలతో ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు భగ్నం చేయడం విచారకరమని టీయూడబ్ల్యుజె పేర్కొంది. ఎమ్యెల్యే కూల్చి వేయించిన కట్టడాన్ని వెంటనే తిరిగి నిర్మించి ఇవ్వాలని, లేనిపక్షంలో సరైన రీతిలో గుణపాఠం చెబుతామని హెచ్చరించింది. ఈ అప్రజాస్వామిక చర్యను అన్ని వర్గాలు ఖండించాలని టీయూడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, రాష్ట్ర కార్యదర్శి ఫైసల్ అహ్మద్,సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మల్లి కార్జున్ రెడ్డి, జిల్లా కార్యదర్శి విష్ణు కుమార్ కోరారు.