మనకు స్వాతంత్య్రం వచ్చిందా? - Tolivelugu

మనకు స్వాతంత్య్రం వచ్చిందా?

 

బంగారు తెలంగాణలో ”భద్రత” కరువు
డ్యూటీలో ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోకుండా
అత్యాచారం, హత్యకు గురైన బాధితురాలి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటు

 అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్న గాంధీజీ కలలు గన్న విషయం కలగానే మిగిలింది. బంగారు తెలంగాణ ట్యాగ్ ను మోసుకు తిరుగుతున్న తెలంగాణ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు కనుగొనకుండా కేవలం మాటలతోనే గడపడంతో తెలంగాణ ప్రజల నిరాశ, నిస్పృహలు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం జీతాలు పెంచింది. పోలీసులకు పోలీస్ స్టేషన్ల నిర్వహణ నిమిత్తం నిధులు మంజూరు చేసింది. ట్రాఫిక్ పోలీసులకు  అధనంగా 25 శాతం ఇస్తున్నారు. పోలీసులకు అధునాతన వాహనాలు సైతం ఇచ్చారు. సంఘటనలు జరుగనప్పుడు సైరన్ లతో హడావుడి చేసే పోలీసులు టోల్ గేట్ సమీపంలోనే ఉంటూ బెంగుళూరు జాతీయ రహదారి అయినప్పటికీ పెట్రోలింగ్‌ వాహనం కనిపించక పోవడంతో మానవ మృగాలు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసి, మృతదేహాన్ని తగులబెట్టారు. ఒక డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రియాంక అత్యాచారానికి గురై కామంధుల చేతిలో దగ్ధమైంది.

 తెలంగాణ రాష్ట్రంలో నేరాలు-ఘోరాలు లేనే లేవని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లు ఊకదంపుడు ఉపన్యాసాలతో అదరగొట్టే బంగారు తెలంగాణ ట్యాగ్ నాయకులు బాధిత కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలి. హైదరాబాద్‌ మహానగరం డిజిటల్ నగరం అనే ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతంలోని షాద్ నగర్‌ టోల్ బూత్ సమీపంలో సరైన విధంగా సీసీ కెమెరాలు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. అంతేగాక పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు చెప్పక తప్పదు. ఇంత వరకు పెట్రోలింగ్ పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి అద్దంపడుతుంది. సోషల్ మీడియాలో ఈ ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టింగ్ లు చెయ్యడంతో ప్రభుత్వం హడావుడిగా స్పందించింది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి మృతురాలు డాక్టర్ ప్రియాంక సోదరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం బాధిత కుటంబసభ్యులకు ఉద్యోగ వసతి కల్పించడం విషయాన్ని పక్కనబెడితే ఈ సంఘటనకు బాధ్యులైన పెట్రోలింగ్‌ పోలీసులు, స్థానిక పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే తమకు ఎదురే లేదని వారిఇష్టం వచ్చినట్టు పరిపాలన కొనసాగిస్తూ కేవలం కంటితుడుపు చర్యలకే పరిమితమడంతో సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటోంది.

 400 యేళ్ల హైదరాబాద్‌ మహానగరంలో మహిళలకు భద్రత కరువు అవడం అంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అబలలు సైతం మగవారికి ధీటుగా అన్ని రంగాలలో రాణిస్తూ ఎంతో భవిష్యత్తు ఉన్న డాక్టర్ ప్రియాంకరెడ్డి లాంటి యువతికి జరిగిన సంఘటన మరెవ్వరికి జరుగకూడదని భావిద్దాం!

విద్యావెంకట్
జర్నలిస్ట్
హైదరాబాద్‌

Share on facebook
Share on twitter
Share on whatsapp