ప్రముఖ జర్నలిస్ట్ విద్యారణ్య కామ్లేకర్ గుండెపోటుతో కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా అందరినీ ఆప్యాయంగా పలకరించిన ఆయన.. ఇంతలోనే కాలం చేయడంపై ఇతర జర్నలిస్టులు విచారం వ్యక్తం చేస్తున్నారు. విద్యారణ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
విద్యారణ్య పరమపదించారని తెలిసి ఎంతో బాధేసిందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
విద్యారణ్య ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. జాతీయ భావాలు కలిగిన ఆయనతో అనేక విషయాల గురించి చర్చించినట్లు గుర్తు చేశారు. విద్యారణ్య సామాజిక కార్యక్రమాల్లో బాధ్యతగా పని చేసేవారని.. ఎందరికో ఆర్థిక సహాయం చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా ఉంటారని.. వారి మరణం పత్రికా రంగానికి జాతీయ భావాలు కలిగిన వ్యక్తులకు తీరని లోటని చెప్పారు.
విద్యారణ్య మరణంపై హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బండి సంజయ్, సత్యకుమార్ సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. విద్యారణ్య ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ, హిందీ మిలాప్ దినపత్రికలలో వివిధ హోదాల్లో పనిచేశారు. కెరియర్ ప్రారంభంలో హిందుస్థాన్ సమాచార్ కు సేవలు అందించారు. కేంద్ర సెన్సార్ బోర్డ్ మెంబెర్ గా చేశారు.