భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు కేటాయించిన ఫ్లాట్లను జిల్లా కలెక్టర్ రద్దు చేయడం పట్ల.. స్థానిక జర్నలిస్టులు గురువారం రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. వీరి దీక్ష రెండో రోజుకు చేరుకుంది. జర్నలిస్టులు కట్టిన ఇండ్లను కూల్చివేసి, స్థలాలను రికవరీ చేసుకుంటామని కలేక్టర్ భవేష్ మిశ్రా ఇచ్చిన నోటీసులు నిరసనగా జర్నలిస్టుల దీక్షకు దిగారు. వారి దీక్షకు ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. 2013వ సంవత్సరంలో భూపాలపల్లి నియోజకవర్గంలో పని చేస్తున్న 47 మంది సీనియర్ జర్నలిస్టులకు.. అప్పటి ప్రభుత్వ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి ఇళ్ల పట్టాలను మంజూరు చేశారు. ఆ పట్టాలను రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఇచ్చిన నోటీసులకు నిరసనగా జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
జర్నలిస్టులకు మద్దతుగా BSP పార్టీ అధ్యక్షుడు దూడపాక సుమన్, పార్టీ నాయకులు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు అప్పకిషన్, వర్తక వ్యాపారుల సంఘం అధ్యక్షుడు ఈగ రవికిరణ్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇంచార్జ్ నాగుల అరవింద్, సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజ లింగమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ఇళ్లు కట్టిస్తానని సీఎం కేసీఆర్ ఎన్నో సభలలో వాగ్దానం చేయడం చేశారు.
ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు ఇల్లు కట్టించకపోగా, ఉన్న ఇంటి స్థలాలను రికవరీ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఇచ్చిన నోటీసులను వెంటనే రద్దు చేసి, జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో వారు ఇళ్లు కట్టుకునే విధంగా చూడాలన్నారు. లేని పక్షంలో జర్నలిస్టులతో మమేకమై పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అనంతరం జర్నలిస్టులు మాట్లాడుతూ.. మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలను.. ఇప్పుడు తీసుకోవడం చాలా దారుణమన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులను పట్టించుకోపోగా, మర్చిపోవడమే కాకుండా, కేటాయించిన స్థలాలను కూడా తీసుకోవడం హేమమైన చర్య అని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, యధావిధిగా మా ఇంటి స్థలాలను మాకే ఇప్పించాలని, కలెక్టర్ ఇచ్చిన నోటీసులను వెంటనే రద్దు చేయాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.