ఓ జర్నలిస్ట్‌ను అక్రమంగా న్యాయ ప్రక్రియకు విరుద్దంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే జర్నలిస్ట్ సంఘాల నేతల నుంచి కనీసం స్పందన లేదు. ఇవాళ రవి, రేపు నేను, తర్వాత నువ్వే. నిజాలు రాసే, అక్రమార్కుల చిట్టా విప్పే ప్రతి జర్నలిస్టును యిలాగే జైల్లో వేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. జరుగుతాయి. అందుకు కారణం మన ఐక్యత లోపం…
కేవలం సర్కార్ యిచ్చే రాయితీల కోసమో, నజరానాలు కోసమో, స్వంత ప్రయోజనాలు వొనగురవనే భయమో, లేదా పైరవీలు, లాభియింగుకు అవకాశం ఉండదనే పెదవి విప్పడం లేదో కానీ, మొత్తం మీద మీ పెన్ను కదలడం లేదు. యిది చాలా శోచనీయం. రాజ్యాంగం కల్పించిన హక్కులు కలిగివున్నది జర్నలిస్ట్ లోకం. ఫోర్త్ ఎస్టేట్ అంటే పరిపాలనలో వొక భాగం. ఎవడి దయా దాక్షిణ్యాల మీదనో, అడుక్కునే వాళ్ళలా అధికారంలో వున్న వున్న వారికి అండగా నిలవాలనిలేదు. స్వార్థంకోసం ఆలోచించి నోరుమూసుకుని ముసుగు వేసుకున్న నేతల్లారా.. ఒకసారి గుండె మీద చెయ్యి వేసుకుని ఆత్మ విమర్శ చేసుకోండి. మీరు యిలా నిశ్శబ్దంగా వుండడం సబబేనా… హక్కుల పోరాటంలో అసువులు బాసిన మన అమర జర్నలిస్టుల ఆత్మ క్షోభకు కారకులు కాకండి. ఈరాష్ట్రం ఏర్పాటుకి మన త్యాగాలే మొదటి ప్రమాణాలు. మనం లేని రాష్ట్రం లేదు. ఈ ముఖ్యమంత్రి స్థానంలో వున్న వ్యక్తికి చోటూ లేదు.
తన లక్ష్య సాధనలో అడ్డు వచ్చేది ప్రముఖంగా జర్నలిస్టులు, ఉద్యోగులే. వీరితోనే ప్రమాదం అన్న భావనతో ఈ నాడు దేశంలో, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో విద్యావంతులను, ప్రజా సంఘాలను, జనం కోసం రాసే జర్నలిస్టులను, ఐఎఎస్ అధికారులను, ప్రశ్నించే అవకాశం వున్న రచయితలు, మేధావులను ఒక ప్రణాళికబద్దంగా అణచివేసి, అక్రమ కేసులు అంటగట్టి ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలు ఇచ్చి, రాజ్యం, రాజరికం, నా మాటే శాసనమనే ధోరణి, నేను చెప్పిందే చట్టమనే అహంకారం.. అన్నట్లు అయిపోయింది యిక్కడ. దీన్ని యిలాగే కొనసాగిస్తే మానవ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు తప్ప యింకోటి వుండదు.
కళ్ళు తెరిచి సొంత లాభం కొంత మానుకు సాటి సహచర జర్నలిస్టుల కోసం, అక్రమ కేసులు నమోదు చేయించిన బాధ్యులకు చట్టపరంగా బుద్ధి చెప్పేందుకు ఐక్యం కండి. ఉమ్మడిగా పోరాటానికి కలిసి రండి. పోరాడితే పోయేదేమీ లేదు.. వస్తే హక్కులు, లేదంటే బానిస సంకెళ్లు తప్ప. జర్నలిస్టులను జనానికి దూరం చేస్తూ జర్నలిజం అంటేనే వొక ప్రచార సాధనంగా మార్చే కుట్రకు తెర లేపారు. అందుకే మీడియా కాస్తా మాఫియా గుప్పిట్లోకి వెళ్లి నిఖార్సైన, జనహిత జర్నలిస్టులకు మనుగడ లేకుండా చేస్తోంది.
కీడును ఎంచి మేలుకొని ఎక్కడైనా, ఎప్పుడైనా ఏ జర్నలిస్టు సోదరునికి చట్టపరంగా ఏవయినా చిక్కులు వస్తే న్యాయపరంగా చట్ట పరిధిలో పరిష్కారం కోసం అందరం కలిసి నడుం కట్టి పరిష్కరించేందుకు నడుం కట్టాలని ఆశిస్తున్నాను. ఐక్యతే అన్నింటికీ సమాధానం. జర్నలిస్టులూ రండి, రవిప్రకాశ్ సంకెళ్లను విడిపిద్దాం. సంఘటితంగా మన కోసం మనం పోరాడదాం..