మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు ప్లాన్ జరిగిందనే విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీని వెనుక బీజేపీ నేతల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. జితేందర్ రెడ్డి, డీకే అరుణ పాత్రపై టీఆర్‌ఎస్ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.
శ్రీనివాస్ గౌడ్ హత్యకు ప్లాన్ వెనుక బీజేపీ నేతలున్నారనే ఆరోపణలను ఖండించారు బండి. ఆరోపణలు ఎదుర్కోవడం బీజేపీకి కొత్త కాదన్న ఆయన.. అసలు నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. తప్పుడు కేసులు, ఆరోపణలతో కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు.
జితేందర్ రెడ్డి, డీకే అరుణతో విడివిడిగా భేటీ అయ్యారు సంజయ్. మహబూబ్ నగర్ లో వారి ఇళ్లపై జరిగిన దాడుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోపణలతో బీజేపీ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు బండి.
మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సంజయ్ కు ఫోన్ చేశారు. రాష్ట్రంలోని పరిణామాలపై అడిగి తెలుసుకున్నారు. బీజేపీ నేతలపై వచ్చిన ఆరోపణల గురించి ఆరా తీశారు. టీఆర్‌ఎస్ కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని బండి వివరించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన నివేదికను కూడా అధిష్టానానికి పంపినట్లు సమాచారం.