– పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం
– ఆ ఊసే లేకుండా ముగిసిన నడ్డా టూర్
– వైసీపీ సర్కార్ ను సాగనంపాలంటూ పిలుపు
– బీజేపీకి అధికారం ఇవ్వాలని వినతి
ఏపీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వస్తున్నారని తెలియగానే.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ను ప్రకటించాలంటూ జనసేన నేతలు తెగ హడావుడి చేశారు. సోషల్ మీడియాలో, ప్రెస్ మీట్లలో డిమాండ్ చేశారు. అయితే.. నడ్డా మాత్రం జనసేన ప్రస్తావన లేకుండానే టూర్ ను ముగించేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం విజయవాడలో దిగిన నడ్డా.. పార్టీ నేతలతో పలు సమావేశాలు నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ నేతలతో భేటీ సందర్భంగా పవన్ విషయం చర్చకు రాగా.. ఎన్నికలప్పుడు చూసుకుందామని చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. పొత్తుల గురించి ఇప్పుడు ఏ మాత్రం పట్టించుకోవద్దని ఆయన నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
ఇక మంగళవారం.. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో బీజేపీ గోదావరి గర్జన సభ జరిగింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు నడ్డా. రాజమండ్రి సాంస్కృతిక నగరమని… ఈ గడ్డ నుంచే తెలుగు భాష ప్రారంభమైందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీ నుంచి ప్రస్తుత ప్రభుత్వాన్ని సాగనంపాలని, బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నట్లు చెప్పారు.
ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పిన నడ్డా.. 2014కు ముందు చాలా ప్రాంతాల్లో కరెంట్, విద్య, వైద్యం ఉండేది కాదని వివరించారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదని.. కేంద్రం ఇచ్చే నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే శాంతిభద్రతలు లేవని విమర్శలు చేశారు.
గతంలో అవినీతి, కుంభకోణాలు మాత్రమే వార్తలుగా నిలిచేవని.. మోడీ అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. గతంలో బంధుప్రీతి వారసత్వానికి పరాకాష్టగా పాలన సాగేదన్నారు. మోడీ రాజకీయ దృక్కోణాన్ని పూర్తిగా మార్చారని చెప్పారు. అవినీతి అంటే జీవితంలో భాగం కాదని ప్రధాని అన్నారని.. మోడీ నాయకత్వంలో అవినీతికి చరమగీతం పాడామని వివరించారు.