నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం బెంగళూరులో మీడియాతో చెప్పారు. తారకరత్నకు చికిత్స అందిస్తోన్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌కు ఆదివారం నందమూరి కళ్యాణ్ రామ్‌తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ వెళ్లారు. హాస్పిటల్‌లో వైద్యులతో మాట్లాడిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్‌తో కలిసి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మీడియాతో మాట్లాడారు.
ముందుగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఈనెల 27వ తేదీన మా కుటుంబంలో చాలా దురదృష్టకర సంఘటన ఒకటి జరిగింది. ఎన్‌హెచ్ హాస్పిటల్స్ వైద్యులు అన్నకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఆయన కూడా పోరాడుతున్నారు. వైద్యంతో పాటు ఆయన ఆత్మబలం, మనోబలంతో పాటు అభిమానుల ఆశీర్వాదం ఉంది. తాతగారి ఆశీర్వాదం ఉంది. ఎంతో మంది ఆశీర్వాదం ఆయనకి ఉంది. త్వరలోనే ఈ పరిస్థితి నుంచి ఆయన త్వరగా కోలుకుని ఇదివరకు లాగే మనందరితో ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నారు. మీరందరూ మీ ఆశీస్సులు అన్నకు అందించాలి. అన్న కోసం ప్రార్థించండి’’ అని అన్నారు.
ఇలాంటి క్లిష్ట సమయంలో కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తమకు అండగా ఉన్నారని.. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎన్టీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం చికిత్సకు తారకరత్న స్పందిస్తున్నారని.. ఆయనకు మెరుగైన వైద్యం అందుతోందని తారక్ తెలిపారు. వైద్యులైతే తారకరత్న ఆరోగ్యం ఇప్పటికీ నిలకడగానే ఉందని చెబుతున్నారని.. అలా అని ఆయన క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడ్డారని చెప్పలేమని ఎన్టీఆర్ వివరించారు. తారకరత్నను ఎక్మోపై ఉంచి చికిత్స అందిస్తున్నారని వచ్చిన వార్తల్లో నిజం లేదని తారక్ స్పష్టం చేశారు. ఒక కుటుంబ సభ్యుడిగా తన అన్నను చూశానని.. వైద్యులతో మాట్లాడానని.. తనకు ధైర్యం చెప్పే విధంగా వైద్యులు తనతో మాట్లాడారరని, దాన్ని అభిమానులకు తెలియజేస్తున్నానని వెల్లడించారు.
NTR @tarak9999 on #TarakaRathna gari Health Condition. pic.twitter.com/ORIj34d28u
— 𝐍𝐓𝐑 𝐓𝐡𝐞 𝐒𝐭𝐚𝐥𝐰𝐚𝐫𝐭 (@NTRTheStalwart) January 29, 2023
ఇక కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘‘మీ అందరి అభిమానంతో తప్పకుండా తమ్ముడు త్వరగా కోలుకుని మన అందరి ముందుకు రావాలని, మీరందరూ ఆ దేవుడిని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
అనంతరం కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ మాట్లాడుతూ.. ‘‘తారకరత్న పరిస్థితి గురించి తెలిసిన వెంటనే ప్రభుత్వం నుంచి గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేశాం. కుప్పం నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ వరకు కూడా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. వారు ఇక్కడికి రాగానే వైద్యులు అందరూ సిద్ధంగా ఉన్నారు. కుప్పంలో మొదటి దశ చికిత్స అయ్యింది. ఏంజియో ప్లాస్టీ అయ్యింది. ఇప్పుడు గుండె పరిస్థితి నిలకడగా ఉంది. మెదడుకు సంబంధించిన చికిత్స జరుగుతోంది. దాని కోసం నిమాన్స్ నుంచి పెద్ద వైద్యులు వచ్చారు. ఆయనకు మెరుగైన వైద్యం అందుతోంది. వీలైనంత త్వరగా ఆయన కోలుకోవాలని ప్రార్థిద్దాం’’ అని చెప్పారు.