– చిరంజీవి కబ్జా భూమి మున్సిపాలిటిదే
– 22 ఏళ్ల క్రితమే హాండోవర్ చేసిన సొసైటీ
– కో ఆపరేటివ్ సొసైటీ నివేదికలో సంచలనాలు
– 8910 గజాల సంగతేంటి!
– అన్నీతెలిసినా ఈ బరితెగింపు దేనికి నిదర్శనం
– జూబ్లీహిల్స్ సొసైటీ కబ్జాలు లైట్ తీస్కుంటున్నఅధికారులు
– వేల కోట్ల భూములపై అంత నిర్లక్ష్యమెందుకు?
– తొలివెలుగు క్రైంబ్యూరో ఎక్స్ క్లూజివ్ కథనం
తొలివెలుగు చెప్పిందే నిజమైంది. నటుడు చిరంజీవి 595 గజాల భూమిని కబ్జా చేశారు.అందుకు సొసైటీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చింది.ఈ విషయాలన్నీ ఎప్పుడో 2000 సంవత్సరంలోని అడ్వకేట్ కమిషన్ తో పాటు రెవెన్యూ అధికారులు ల్యాండ్ సర్వే చేసి మున్సిపల్ శాఖకు హ్యాండ్ ఓవర్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి.అప్పటి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ తో పాటు ఒక ప్రభుత్వ అధికారి మున్సిపల్ కమిషనర్ కి అధికారికంగా లేఖ కూడా రాశారు. ఆ లేఖ తొలివెలుగు ఎక్స్ క్లూజివ్ గా సంపాదించింది. సొసైటీ అక్టోబర్ 9, 2000 సంవత్సరంలో అది తమ భూమి కాదనీ, ప్రభుత్వ భూమి అని..సర్వే చేసిన రిపోర్ట్ ని అడ్వకేట్ కమిషన్ హైకోర్టుకు నివేదించింది. దీంతోపాటు చిరంజీవి ఇంటి వద్ద ఖాళీగా ఉన్న 8,910 గజాల ప్రభుత్వ భూమిని హైదరాబాద్ మున్సిపాలిటీకి అప్పగించారు.
హక్కులు అన్నీమున్సిపాలిటీకే ఉన్నాయని.. దానిని కాపాడుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ సదరు వ్యవహారం వెనుక కొన్నిమీడియా సంస్థలు ఉన్నాయని జిహెచ్ఎంసి వారు మేనేజ్ చేస్తూ అక్రమంగా అమ్మకాలు మొదలుపెట్టారు. ఈ భూమినంతటినీ కాపాడుకోవాల్సిన అధికారులు జూబ్లీహిల్స్ సొసైటీకి జీ హుజూర్ అంటూ తలా కొంత పంచుకు తిన్నారు. అదే విషయాన్నితొలి వెలుగు పదే పదే ప్రచురిస్తూనే ఉంది. 2000 సంవత్సరం వరకు మొత్తం 18 వేల ఒక వంద గజాల ప్రభుత్వ భూమిని గుర్తించి మున్సిపాలిటీకి అప్పగించారు. కానీ ఇందులో చాలా మటుకు అక్రమంగా కబ్జాలు చేసి అమ్ముకున్నారు. ఎంతమంది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేది.. పూర్తి వివరాలతో మీ ముందు మరో కథనంలో ఉంచుతాం.
ఒక్క చిరంజీవియే 20 కోట్ల రూపాయల భూమిని 3 కోట్లకు కొట్టేశారు. ఇలా బడా బాబులంతా కేవలం రిజిస్ట్రేషన్ వేల్యూ తోనే సొసైటీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుని కబ్జా పెట్టేసి దర్జాగా ఉన్నారు. ఆ ప్రాంతానికి రోడ్డు లేదనే వంక చూపించి ఇష్టానుసారంగా వ్యవహరించారు.ఇంత జరిగినా అధికారులు ఎవరూ స్పందించలేదు.లెటర్స్ పంపుతున్నామని.. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చూపిస్తామని వట్టి మాటలతో కాలం గడిపేస్తున్నారు.చిరంజీవితో పాటు అక్రమాలకు పాల్పడ్డ బడాబాబుల భూములను అన్నింటినీ స్వాధీనం చేసుకుని బహిరంగ మార్కెట్ కి వేలం వెయ్యాలి.లేదా ముక్కు పిండి నిజమైన రేటు ఎంతో అంత వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రెవెన్యూ అధికారులు గతంలో సర్వే చేసి ఇచ్చిన రిపోర్టును మరొకసారి మున్సిపల్ అధికారులకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది.మున్సిపల్ అధికారులు గతంలో సర్వే చేసిన రిపోర్టు ఆధారంగా హద్దులు గుర్తించి ఎవరెవరు ఎంత కబ్జా పెట్టారో, వారందరికీ నోటీసులు ఇచ్చి భూమిని స్వాధీనం చేసుకోవాలి. ఖాళీగా ఉన్న భూమిని వెంటనే ప్రభుత్వ భూమిగా బోర్డులు పాతాలి. కబ్జా చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నవాటిపై మున్సిపల్ శాఖ అవసరమైతే కోర్టుకు వెళ్లి స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. కేవలం తమ స్వార్థం మాత్రమే చూసుకుని, ప్రభుత్వ భూమిని ఏమాత్రం భయం లేకుండా కబ్జా చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.వాటన్నింటినీ కూడా ప్రభుత్వ భూమి అని తక్షణం బోర్డులు పాతాల్సిన అవసరం ఉంది. అటు.. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి రిజిస్ట్రేషన్ రద్దు చేయమని సబ్ రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేయాలి. అలాగే ప్రెసిడెంట్ రవీంద్రనాథ్, కోశాధికారి నాగరాజు మరియు మేనేజింగ్ కమిటీ సభ్యుల మీద కేసులు పెట్టమని పోలీసులను కోరాలని సొసైటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.