– భారతి పేరుతో 2 ప్లాట్స్..
– సత్యారావు ప్లాట్ ప్రశాంతికి..
– మార్పిడి పేరుతో రెగ్యులరైజేషన్
– వెయిటింగ్ లిస్ట్ ఉన్నా నచ్చిన వారికే!
– తొలివెలుగు క్రైంబ్యూరో చేతిలో పక్కా ఆధారాలు
– సొసైటీ పెద్దలూ.. చర్యలు ఎప్పుడు?
క్రైంబ్యూరో, తొలివెలుగు:తవ్వేకొద్దీ జూబ్లీహిల్స్ సొసైటీ అక్రమాలు ఎన్నో బయటపడతాయి. కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ భూమిని ఈ సొసైటీకి కేటాయించారు. ఐఏఎస్, పద్మశ్రీ గ్రహీత నర్సింహం మద్రాస్ నగరాన్నిఎలా నిర్మించారో.. జూబ్లీహిల్స్ భవిష్యత్ కి రూట్ మ్యాప్ వేశారు. హైటెక్ సిటీకి పునాదిరాళ్లు పడగానే ఇక్కడ ప్లాట్స్ ధరలకు రెక్కలొచ్చాయి. ఇంకేముంది ఎవరికి పడితే వారికి లక్ష రూపాయల కమిషన్ తీసుకొని పంచేయడం మొదలైంది. 160 ప్లాట్స్ అక్రమంగా కేటాయించుకున్నారు. కొన్ని ప్లాట్స్ ని వారి కుటుంబ సభ్యుల పేర్లు మార్చి కబ్జా చేసుకున్నారు. అయితే, వీటన్నింటిపై చర్యలు తీసుకోవాలని తొలివెలుగు మొదట్నుంచి డిమాండ్ చేస్తోంది. 2 లక్షల కోట్ల విలువైన భూమిలో 10 వేల కోట్ల భూమి కబ్జా నిజాలేంటో జనానికి తెలియాలి. అయితే, మీడియా హౌజ్ లను అడ్డుపెట్టుకుని కాలం గడిపేస్తున్నారు. కేసులు నమోదు అయినా మేనేజ్ చేస్తున్నారు. విచారణలు, దర్యాప్తులు చేసినా రిపోర్ట్ లను ప్రభుత్వాలు పట్టించుకోకుండా లాబీయింగ్ లకు పాల్పడుతున్నారు. తప్పు ఎప్పుడైనా తప్పే.. కుట్రపూరిత మోసాలకు ఏనాడైనా శిక్ష పడాల్సిందే. అందుకే ఉత్తుత్తి సభ్యత్వాల రద్దు రివెంజ్ కాకుండా అక్రమాలపై చర్యలు తీసుకోవాలి. అర్హులైన సభ్యులకు అపార్ట్ మెంట్స్ ఇవ్వాలి. తమిళనాడులో సీనియర నటి వాణిశ్రీ ప్లాట్ ని కబ్జా చేస్తే.. 14 ఏళ్ల తర్వాత సీఎం స్టాలిన్ మళ్లీ ఇప్పించారు. అలాంటి రోజులను జూబ్లీహిల్స్ లో చూడాలి. అందుకు అక్రమాలు ఎక్కడెక్కడ జరిగాయో అందరి ముందుకు తీసుకొస్తోంది తొలివెలుగు క్రైంబ్యూరో.
భారతి టు రామారావు!
మెంబర్ షిప్ నెంబర్ 2319, ప్లాట్ నెంబర్ 548/ఏ/17.. పేరు డి భారతి. 88 జులై 21న 2,629 చదరపు గజాల ప్లాట్ రెండో బ్లాక్ లో కేటాయింపు జరిగింది. అయితే, 548/ఏ/17/ఏ తో మరో ప్లాట్ ని 2001లో 1542 చదరపు గజాల భూమిని బైలాస్ కు విరుద్ధంగా కేటాయించారు. ఈ ప్లాట్ నెంబర్లో నిర్మాణం కోసం అప్పట్లో ఎంసీహెచ్ ను కోరినా అనుమతులు లభించలేదు. కానీ, అదే ప్లాట్ లో నిర్మించిన భవనంలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గతంలో విచారించిన అధికారులు బినామీ బిల్డింగ్ ఓనర్ రామారావు నుంచి సమాధానం రాబట్టారు. అయితే, ఇతను ఎవరనేది సొసైటీ ఇప్పటి వరకు లెక్కలు తేల్చలేదు.
సత్యారావు ప్లాట్స్ ప్రశాంతికి!
మెంబర్ షిప్ నెంబర్ 5234. పేరు ప్రశాంతి. ప్లాట్ నెంబర్ 1355-హెచ్. సొసైటీ రికార్డుల ప్రకారం వాస్తవానికి మెంబర్ షిప్ నెంబర్ 2305 పి సత్యారావుకు 1355-హెచ్ ప్లాట్ ను 1998 జులై 21 నిర్వహించిన డ్రా ద్వారా కేటాయించారు. 1994 ఫిబ్రవరి 26న భవన నిర్మాణానికి సొసైటీ ఓకే కూడా చెప్పింది. కానీ, ప్రశాంతి పేరుతో 1997 జనవరి 18న బదిలీ చేసినట్లు ఉంది. ప్రశాంతి సభ్యత్వాన్ని రద్దు చేయాలని హైదరాబాద్ జిల్లా సహకార అధికారి నిర్ణయించారు. కానీ, భవన నిర్మాణ అనుమతి కోసం 25వేల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుగా 2007 సెప్టెంబర్ 2న ఆమె పేరుతో చెల్లింపు జరిగింది. ప్లాట్ కేటాయింపు డ్రా ద్వారా 1998లో జరిగితే.. 1997లోనే బదిలీ చేశారని విజిలెన్స్ దర్యాప్తులో తేలింది.
పరస్పర మార్పిడి చెల్లదు!
పి రమణశ్రీ అనే మహిళకి ప్లాట్ నెంబర్ 1057 – ఏ ని కేటాయించారు. అలాగే శైలజ అనే మహిళకు ప్లాట్ నెంబర్ 573-ఎఫ్ ఇచ్చారు. ఇద్దరి మధ్య పరస్పర అవగాహనతో ప్లాట్లను మార్చుకున్నారు. సొసైటీ నిబంధనలకు విరుద్దంగా ప్లాట్లు మార్చారు. 545 చదరపు మీటర్ల భూమిని 2007 డిసెంబర్ 15న క్రమబద్ధీకరించినట్లు సొసైటీ ఆదేశాలు వెలువడ్డాయి.
క్రిమినల్ కేసులు!
మెంబర్ షిప్ నెంబర్ 2052 నల్లారి సురేష్. మెంబర్ షిప్ నెంబర్ 1495 వి రంగమ్మ.. తమకు కేటాయించిన ప్లాట్లను సొసైటీ మేనేజింగ్ కమిటీ అంగీకరంతో మార్చుకున్నారు. ఇది తప్పని షోకాజ్ నోటీసు ఇచ్చిన సొసైటీ అధికారికి రద్దు చేసే అధికారం లేదంటూ సురేష్ సమాధానం ఇచ్చారు. దీంతో అతనితో పాటు 13 మంది మాజీ మేనేజింగ్ కమిటీ సభ్యులపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి వచ్చింది. నల్లారి సురేష్ తో పాటు కేసులో ఉన్న మిగిలిన 13 మంది మాజీ సభ్యులు ఎవరనే అంశం ఇప్పటికీ బయటపడలేదు. అక్రమ నిర్మాణాలు, సొసైటీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకుండా చూస్తున్న ఆ బడా బాబులు ఎవరనేది ఎవరికీ తెలియనివ్వడం లేదు. ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్ల కారణంగానే ఆ సభ్యుల పేర్లు బయటకు రాలేదని తెలుస్తోంది.
మెంబర్ షిప్ సీనియార్టీ అవసరం లేదా?
ప్లాట్ నెంబర్ 1355-ఐ కేటాయింపుపై వివాదం ఉంది. ఈ కేసులో సొసైటీ పెద్దలు తమకు నచ్చిన వారికి పెద్దపీట వేసినట్లు స్పష్టంగా రుజువైంది. పద్మారెడ్డి అనే వ్యక్తికి 1994 నవంబర్ 28న సొసైటీలో సభ్యత్వం తీసుకుంటే… మెంబర్ షిప్ నెంబర్ 4792 కేటాయించారు. అలాగే వి శర్మారావు 1998లో సొసైటీ సభ్యత్వం పొందితే మెంబర్ షిప్ నెంబర్ 2283 ఇచ్చారు. పద్మారెడ్డి కంటే నాలుగేళ్లు తర్వాత సొసైటీలో చేరిన శర్మారావుకు 443 ఏ/15-III అనే ప్లాట్ ను 1998 జులై 21న జరిగిన డ్రాలో కేటాయించారు. ఆ ప్లాట్ లో పేదల గుడిసెలు వేసుకోవడంతో మరో ప్లాట్ కేటాయించాలని శర్మారావు కోరారు. దీన్ని వెంటనే అంగీకరించిన సొసైటీ 1355-1ను కేటాయించింది. దీనికి పద్మారెడ్డిని 826 చదరపు గజాల ప్లాట్ కు జీపీఏగా ఎంచుకున్నారు. ఆ ప్లాట్ ను ఇద్దరు కలిసి 2006 ఏప్రిల్ 6న సొమ్ము చేసుకున్నారు. అయితే, పద్మారెడ్డి సొసైటీలో మెంబర్ గా కొనసాగుతూనే ఇలా వ్యవహరించడంతో ఆ ఇద్దరితో పాటు ప్లాట్ కేటాయించిన మాజీ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
ఇప్పటికే 5 ఎకరాల ప్రభుత్వ భూమిని 573 సిరిస్ నెంబర్ తో అక్రమంగా బంధువులకు కేటాయించుకున్నారని వాటిని ఫినిక్స్ కి ఇచ్చేశారని కథనాలు ఇచ్చాం. అయితే, ఖాళీ ప్లేస్ లో డెవలప్మెంట్ల పేరుతో చేసిన దందాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు కొత్త కమిటీ కూడా కమిషన్స్ కి కక్కుర్తి పడి అవన్నీ రద్దు చేస్తాం లేదా తాము చెప్పినట్లు వినాలి, చేయాలని బెదిరిస్తున్నట్లు అరోపణలు వినిపిస్తున్నాయి. ఆ నిజానిజాలేంటో.. ఎక్కడెక్కడ ఎలాంటి భూములు లీజ్ కి ఇచ్చారో మరో కథనంలో చూద్దాం.