– జూబ్లీహిల్స్ లో పీక్ స్థాయికి సొసైటీ గొడవ
– ఒక వర్గంపై మరో వర్గం సభ్యత్వాలు రద్దు
– అక్రమాలకు పుట్టినిల్లులా జూబ్లీహిల్స్ సొసైటీ
– తవ్వే కొద్దీ బయటపడుతున్న కబ్జా కథలు!
– బజారున పడుతున్నబడాబాబులు
– జరిగిన స్కాంల విలువ మార్కెట్లో రూ.10 వేల కోట్లు!
– తొలివెలుగు క్రైంబ్యూరో చేతిలో లిస్ట్
– ఎక్స్ క్లూజివ్ స్టోరీస్.. త్వరలో..!
జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌజింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఇండియాలోనే అతి పెద్దది. ఆసియాలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి. ఈస్ట్ బంజారాహిల్స్, వెస్ట్ హైటెక్ సిటీ, నార్త్ కృష్ణనగర్, సౌత్ ఫిలింనగర్ మధ్యలో అక్షరాలా 1398 ఎకరాలు. అది 1962వ సంవత్సరం. వ్యాపారవేత్తలు అందరూ కలిసి ఉండేందుకు వీలుగా ఏర్పడిన హౌజింగ్ సొసైటీ. 4,900 మంది సభ్యులు. 30శాతం ఓపెన్ స్పేస్, జీ-2 బిల్డింగ్ లకు మించి అనుమతి లేకుండా నిర్మించాలని ఎజెండా. కానీ, యూఎల్సీ యాక్ట్ వర్తించకుండా జాగాల కేటాయింపు జరిగింది. మీడియా ఛానల్స్ అడ్డుపెట్టుకుని అక్రమాలను బయటపడకుండా కాపాడుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. గత పుష్కరకాలంలో ఏ దర్యాప్తును ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంది ఈ మీడియా యజమానులేనని సభ్యులు చెబుతున్నారు. ఇన్నాళ్లు అక్రమాలు జరిగాయని గత కమిటీలు ఇచ్చిన వార్తలనే తొలివెలుగు క్రైంబ్యూరో వరస కథనాలు ఇచ్చింది. ఇప్పుడు కక్షలకు వెళ్లి సొసైటీ పరువును ఇరు వర్గాలు బయటపెట్టుకోవడంతో ఐదుగురి సభ్యులను సొసైటీ నుంచి తొలిగించగా.. జూబ్లీ క్లబ్ నుంచి ఏడుగురి సభ్యత్వం రద్దు చేయడంతో వివాదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. అయితే, ఈ స్కాంలను మరోసారి ప్రజల ముందుకు తేవాల్సిన అవసరం కనిపిస్తోంది. పెద్ద మనుషుల ముసుగులో ఎలా సంపాదించారో ప్రజలకు తెలియాల్సి ఉంది. పాత పాలక మండలి కబ్జాలేంటి? కొత్త పాలక మండలి కొద్ది రోజుల్లోనే ఇంత ఆగడాలు ఎందుకు? రాబోయే రోజుల కోసం వేసి స్కెచ్ లు ఏంటో.. ఈ కాస్ట్లీ ఏరియాలో కబ్జాల పర్వం కళ్లకు కట్టేలా చూపించబోతోంది తొలివెలుగు.
రోడ్ నెంబర్ 1 భూ వివాదమే ఆజ్యం పోసిందా?
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 లో చిరంజీవి బ్లడ్ బ్యాంకు పక్కన ఉండే సుమారు రెండెకరాలు. పాత పాలక మండలి కొత్త పాలక మండలి గొడవలను తీవ్ర స్థాయికి తీసుకెళ్లాయి. ఓ వ్యక్తి 2 వేల గజాల పార్క్ ప్రాంతాన్ని కబ్జా చేసి 20 ఏళ్లుగా నర్సరీ నడిపిస్తున్నాడు. నిజానికి చిరంజివి బ్లడ్ బ్యాంకు నుంచి మొదలుకుని ఈ 6వేల గజాలు క్లినిక్ కోసం ఉపయోగించాలి. అయితే, ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉండటంతో కార్పొరేట్ కార్యాలయాలు నిర్వహించేలా పాత పాలక మండలి సొసైటీకి 40 శాతం, బిల్డర్ కి 60 శాతం ఉండేలా మంతెన రియల్టీ ఎల్ఎల్పీతో రిజిస్ట్రార్ అగ్రిమెంట్ చేసుకుంది. అయితే, ఇంత ప్రైం ల్యాండ్ కి 40-60 రేషియో ఏంటని కొత్త కమిటీ అభ్యంతరం చెబుతోంది. అంతకుముందు అదే భూమిని మరో సభ్యునికి కేటాయించారని కోర్టులో కేసులు వేశారు. ఆ వ్యక్తికి వేరే విధంగా లబ్ది చేకూరేలా బిల్డరే చూసుకోవాలి. అనుమతులతో పాటు అన్నిఅంశాలు డెవలపర్ కే ముడిపడి ఉండటంతో పర్సెంటేజ్ విషయం సొసైటీకి తగ్గిందని పాత కమిటీ నరేందర్ చౌదరి టీం వాదన. రెండు కోట్ల రూపాయలు సొసైటీకి డిపాజిట్ చేశారు. 40 లక్షలు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కి ప్రభుత్వానికి చెల్లించారు.ఇదంతా లీగల్ గా సొసైటీ రూల్స్ ప్రకారం పాలక మండలి సభ్యుల ఆమోదంతోనే జరిగిందని తమ నిర్ణయాలకే హక్కులు ఉన్నాయని వీరి బలమైన నమ్మకం. టీవీ5 ఎండీ రవీంద్రనాథ్ నాయుడు బొల్లినేని కొత్త పాలక మండలి చైర్మన్ అయ్యాక అక్రమాలు జరిగాయని ఆ అగ్రిమెంట్ ని రద్దు చేశారు. దీంతో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ట్రైబ్యునల్ లో చూసుకోవాలని తీర్పు వచ్చింది. అయితే, పాత కమిటీ నిర్ణయాన్ని రద్దు చేసి సభ్యులకు మేలు జరిగేలా ఉంటే బాగుంటుంది.. ఇంకా స్థలం కేటాయించని వారు చాలామంది ఉన్నారు. కానీ, వీరుకూడా వారికి పర్సనల్ గా లబ్ది చేకూరే పనులే చేసేలా ప్లాన్స్ గీసుకుంటున్నారని సమాచారం. ఈ ఇష్యూ వీధి రౌడీలను కాపలా పెట్టేంత దూరం వరకు వెళ్లింది.
మెగాస్టార్ కి రిజిస్ట్రేషన్ చేయడం వెనుక ఆంతర్యం అర్థమౌతోంది!
చిరంజీవి ఇంటి దగ్గర రోడ్డు భూమిని అక్రమంగా మార్కెట్ ధర కంటే తక్కువకే రిజిస్ట్రేషన్ చేసింది కొత్త కమిటీ. దీంతో పాత కమిటీతో పాటు అక్రమాలకు పోటీపడి తెర లేపిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 595 గజాలని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై మున్సిపల్, హౌసింగ్ సొసైటీ అధికారులకి, పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అటు.. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన మెగాస్టార్ రోడ్డు భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. రూ.20 కోట్ల భూమిని కేవలం మూడున్నర కోట్ల రూపాయలకే దక్కించుకోవడం వెనుక ప్రస్తుత పాలకమండలి అధ్యక్షులు రవీంద్రనాథ్, ట్రెజరర్ నాగరాజుల హస్తం ఉందంటున్నారు. వీళ్లు అక్రమంగా సుమారు 6 కోట్లు లబ్ధి పొందడంతో పాటు తెరవెనుక పనులను చేయించుకునేందుకు చిరంజీవిని వాడుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారని పాత కమిటీ ప్రచారం చేసింది. ప్లాట్ నెంబర్ 303 ఎన్ లో 3,333 చదరపు గజాలు కలిగిన భూమిని 1999వ సంవత్సరంలో చిరంజీవి 120 x 250 కొలతలతో కొనుగోలు చేసారు. ఈ భూమికి దక్షిణ దిశగా ఉన్నఖాళీ ప్రదేశం 595 గజాలు హైదరాబాద్ మహా నగర పాలక సంస్థకి సంబంధించిన ప్రభుత్వ భూమి. జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లేఔట్ లో రోడ్డని ఉంది. అయితే, చిరంజీవి ఆధీనంలో ఉంటే.. జీవో నెంబర్ 58, 59 ప్రకారం ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకొని రెగ్యులరైజ్ చేసుకోవాలి. కానీ, చిరంజీవికి సబ్ రిజిస్ట్రార్ సహకారంతో లేఔట్ ను పరిశీలించకుండా ఎంతో రహస్యంగా 595 చదరపు గజాల భూమిని 117×47 కొలతలతో డాక్యుమెంట్ నెంబర్ 2740 -2022 చేయించుకున్నారు. గతంలో కూడా ప్రభుత్వ భూమి ప్లాట్ నెంబర్ 254- 3 అమ్మకం చేశారు. రియల్ మాఫియా లీడర్ అయిన కుర్ర శ్రీనివాస్ బంధువుకి చెందిన వారికి ఇచ్చారు. 2021 జులై 23 నాడు పొలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రవీంద్రనాథ్ వ్యవహారశైలిపై విమర్శలు వచ్చాయి. మీటింగుల్లో నీతి వాక్యాలు పలుకుతున్నారు తప్ప.. వ్యవహారాలన్నీ దొంగచాటుగా కానిచ్చేస్తున్నారని పాత కమిటీ విమర్శలు గుప్పించింది. అయితే, పాత కమిటీ చేసిన కబ్జాలు, అప్పగించిన భూముల సమయంలో ఇలా బయటపెట్టిన వారు లేరు. వచ్చినా విషయం ఆలస్యంగా పొక్కడంతో వేడి పుట్టేది కాదు. దీంతో వారి అక్రమాలు మూడు ప్లాట్స్, ఆరు బిల్డింగ్ లా ఎదిగిపోయారు. ఇప్పుడు కాలం మారిపోవడంతో అన్నీ వెంటనే బయటపడుతున్నాయి.
రోడ్ నెంబర్ 46లో అంతే!
రోడ్ నెంబర్ 46లో 700 గజాల ప్రభుత్వ భూమి ఉండగా.. దాన్ని కబ్జా చేసి రూమ్స్ నిర్మించి రెస్టారెంట్ కి నెలకు 2 లక్షలకు అద్దెకు ఇచ్చేశారు. కొత్త కమిటీ వచ్చాక.. ఓ పెద్ద రెస్టారెంట్ వారు ఆ స్థలాన్ని అడగ్గా ఇవ్వలేదు. కాంగ్రెస్ నేత వారి అనుచరుల పేర్లపై తీసుకుందామని కమిటీ సభ్యులు రాయబేరాలు చేశారు. కానీ.. ఇంతలోనే ఫిర్యాదులు అందడంతో పిబ్రవరి 16న జీహెచ్ఎంసీ ఎమ్మారోకి లెటర్ రాయడం… భూమి సర్వే చేయించి ప్రభుత్వ బొర్డులు పాతడం.. నిర్మాణాలు కూల్చివేయడం చకచకా జరిగాయి.
నాగేంద్ర నెంబరే కాదట!
కొత్త కమిటీ సభ్యులు నాగేంద్ర ప్రసాద్ తన మెంబర్ షిప్ 983.. ప్లాట్ నెంబర్ 535/111 ని మరొకరికి విక్రయించారు. అయితే, ఎలక్షన్స్ కంటే ముందే అమ్ముకుని ఆ తర్వాత ఎన్నికల్లో పోటీచేశారు. సొసైటీ రూల్స్ ప్రకారం అమ్ముకున్న వెంటనే అతను సభ్యుడిగా కొనసాగే అవకాశాలు ఉండవు. కానీ.. ఏకంగా పాలకమండలిలోనే పాగా వేశారంటే ఇంకా అక్రమాలు జరగడం లేదని ఎలా అనుకోవాలి.
ఐటీ శాఖ విచారణను ఎదుర్కొన్నారు!
కబ్జాలు చేసేందుకు అక్రమంగా సభ్యులను చేర్చారని గతంలోనే విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ తేల్చింది. ఇల్లీగల్ గా ఎడాపెడా కుటుంబసభ్యులకు, బంధువులు, స్నేహితులు వారి డ్రైవర్స్ కి ఇచ్చుకున్న ప్లాట్స్ పై ఇటీవల ఐటీ శాఖ విచారణ చేపట్టింది. 1987 నుంచి 1991 వరకు మూడు దఫాలుగా కేటాయించిన ప్లాట్స్ లో 168 మందికి అక్రమంగా ఇచ్చారని గతంలో విజిలెన్స్, సీబీసీఐడీతో పాటు సొసైటీ అధికారులు దర్యాప్తు చేశారు.1987 నుంచి ఉన్న పాలక మండలి సభ్యులు విచారణకు హాజరయ్యారు. అప్పటి ప్రెసిడెంట్ టీఎల్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఎన్ఎం చౌదరితో పాటు సెక్రెటరీలుగా పని చేసిన సీవీఆర్(సీ వెంకటేశ్వరరావు), జీ నర్సింహారావు, పీ సుబ్బారావులు ఉన్న సమయంలో చేసిన వ్యవహారాలపై లోతుగా దర్యాప్తు జరిగింది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు వివిధ రూపాల్లో జరిగిన కబ్జాల మార్కెట్ విలువ రూ.10 వేల కోట్లు. భూ కుంభకోణం ఎలా జరిగిందో పూసగుచ్చినట్లు త్వరలో ప్రజల ముందుకు కథనాలు రానున్నాయి.