ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితుల బెయిల్ పిటిషన్ పై తీర్పు మళ్లీ వాయిదా పడింది. ఫిబ్రవరి 16 మధ్యాహ్నం 3 గంటలకు బెయిల్ పై ఉత్తర్వులు జారీ చేస్తామని రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించింది. లిక్కర్ స్కాంలో మనీ లాండరిండ్ కు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని, అందుకే నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారయ్యే అవకాశముందని జస్టిస్ నాగ్ పాల్ దృష్టికి తెచ్చారు. ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ పై తీర్పును వారం పాటు వాయిదా వేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టైన అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ బెయిల్ కోసం రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు.
నిజానికి గత నెల 23 నే న్యాయస్థానం బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది. ఫిబ్రవరి 9న ఉత్తర్వులు ఇస్తామని ప్రకటించింది. తాజాగా కేసు విచారణ జరిపిన న్యాయ స్థానం తీర్పును 16 వ తేదీకి వాయిదా వేసింది. అయితే జనవరి 6న 13,657 వేల పేజీల అనుబంధ చార్జిషీటును ఈడీ దాఖలు చేసింది.
అయితే 428 పేజీలతో ఈడీ ఫిర్యాదు నివేదిక అందింది. సప్లిమెంటరీ చార్జిషీట్ లో ఐదుగురు పేర్లను, ఏడు కంపెనీలను ఈడీ చేర్చింది. విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరద్ చంద్రారెడ్డి, బెనోయ్ బాబు, అమిత్ అరోరాలను ఈడీ నిందితులుగా చేర్చింది. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల లావాదేవీల ఆధారాలను సప్లమెంటరీ చార్జిషీట్ లో ఈడీ పేర్కొన్నట్లు సమాచారం. సౌత్ గ్రూప్ లావాదేవీల్లో కీలక వ్యక్తులుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, అభిషేక్, విజయ్ నాయర్, బినోయ్ బాబు ఉన్నారు. ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో కంపెనీ ఒప్పందాలను బయటకు వెల్లడించవద్దని సమీర్ మహీంద్ర పిటిషన్ దాఖలు చేశారు.
సమీర్ మహీంద్ర రిక్వెస్ట్ ని స్పెషల్ కోర్టు అనుమతించింది. సమీర్ మహీంద్రు తరపు న్యాయవాది మాట్లాడుతూ.. అభియోగాల పత్రంలో సమాచారం బయటకు వెళితే తమ వ్యాపారాలకు ప్రమాదం ఉందన్నారు. తమ కంపెనీ వ్యక్తిగత సమాచారం బయటపెట్టడానికి వీలు లేదన్నారు. రహస్య ఒప్పందాలు లీక్ అయితే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నారు. అయితే ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల ఆస్తులు అటాచ్ చేసింది.