ఏడేళ్ల క్రితం ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులనుకొని 17 మంది గ్రామస్థులను పోలీసులు కాల్చివేసిన సంఘటన నిజమేనని దర్యాప్తు కమిటీ తేల్చింది. 2012 జూన్ 28న బీజాపూర్ జిల్లా సర్కేగూడలో గ్రామస్థులు ‘బీజ్ పందుమ్’ పండుగ గురించి చర్చించేందుకు ఒక చోట సమావేశమయ్యారు. అయితే మావోయిస్టుల సమావేశానికి గ్రామస్థులు హాజరైనట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న భద్రతా దళాలు ఒక్కసారిగా గ్రామస్థులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 17 మంది గ్రామస్థులు చనిపోయారు. అయితే వారు గ్రామస్థులని ఆలస్యంగా తెలుసుకున్న భద్రతా దళాలు గ్రామస్థులు తమపై కాల్పులు జరిపారని..తాము ఎదురుకాల్పులు జరపడంతోనే వారు చనిపోయారని చెప్పారు. ఈ కాల్పులపై అప్పట్టోనే పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి.దీంతో అప్పటి బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు కోసం జస్టిస్ వీకే అగర్వాల్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ విస్తృత స్థాయిలో దర్యాప్తు చేసి పోలీసులు చంపింది గ్రామస్థులనేనని..వారి దగ్గర ఆయుధాలు లేవని..వారు కాల్పులకు దిగలేదంటూ నివేదిక తయారు చేసిచేసి ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఇప్పుడు మీడియాకు లీకైంది.