ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరుణ్ రామచంద్ర పిళ్లైకు 14రోజుల జ్యుడిషియల్ కస్టడీని కోర్టు విధించింది. ఈ కేసులో ఈడీ కస్టడీ ముగియడంతో ఆయన్ని రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో అధికారులు హాజరు పరిచారు. కేసులో వాదనలు విన్న కోర్టు ఆయనకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన్ని తీహార్ జైలుకు తరలించారు. జైల్లో ఆయనకు థైరాయిడ్ మందులు, ఐ డ్రాప్స్, దుస్తులను అందించాలని కోర్టు సూచించింది. న్యాయస్తానం తీర్పు నేపథ్యంలో ఆయన వచ్చే నెల 3 వరకు జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లోనే వుండనున్నారు.
లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూపు కీలక భూమిక పోషించిందని ఈడీ ఆరోపణలు చేసింది. ఈ కేసులో సోమవారం పిళ్లైతో కలిపి ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ విచారించింది. సుమారు మూడు గంటల పాటు ఈ విచారణ కొనసాగినట్టు సమాచారం.
గతంలో పిళ్లయ్ ఇచ్చిన వాంగ్మూలానికి అనుగుణంగా వారిద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి సమాధానాలు రాబట్టారు. ఇది ఇలావుంటే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సౌత్ గ్రూపులో మరో సభ్యుడిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, కవితకు గతంలో వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు తదితరులను కూడా ఈడీ జాయింట్‌గా ప్రశ్నించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.