నేషనల్ పాలిటిక్స్ లో బీబీసీ ఐటీ సర్వే ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. అధికారులు తనిఖీలు ఆపేసినా.. విపక్షాలు ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూనే ఉన్నాయి. అయితే.. ఇదే ఇష్యూకి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్ కు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన వారిని, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం మోడీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని కొద్ది రోజుల క్రితం విమర్శించారు కవిత. వాస్తవాలు చూపించే మీడియా గొంతును మోడీ ప్రభుత్వం నొక్కుతున్న విషయాన్ని బీఆర్ఎస్ ఎప్పటి నుంచో చెబుతూనే ఉందని అన్నారు. ఒక వ్యాపార సంస్థపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న కేంద్రం.. నిజాన్ని చూపించే ప్రయత్నం చేసిన బీబీసీపై దర్యాప్తు సంస్థలను ఎందుకు ఉసిగొల్పిందని ప్రశ్నించారు కవిత.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ట్వీట్ పై తాజాగా కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీకి మీకు తేడా ఏమీ లేదని సెటైర్లు వేశారు. కేంద్రంలో ప్రధాని మోడీ మీడియా గొంతును అణిచివేస్తుంటే.. రాష్ట్రంలో మీరు మీడియా వాయిస్ ను కొనుగోలు చేస్తున్నారని.. అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తేడా ఏముందని ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబంపై తరచూ దర్యాప్తు సంస్థలకు ఏదో ఒక ఫిర్యాదు చేస్తూనే ఉంటారు జడ్సన్. ఆమధ్య లైగర్ సినిమా పెట్టుబడుల విషయంలో కవితపై తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే, భూముల వ్యవహారాలకు సంబంధించి కూడా కేటీఆర్, కేసీఆర్ పై కంప్లయింట్స్ చేశారు.