జులై నెలలో భారీ అంచనాలతో వచ్చిన సినిమాలున్నాయి. అదే టైమ్ లో చిన్నవి కూడా రిలీజయ్యాయి. నాగచైతన్య, రవితేజ, రామ్, గోపీచంద్ లాంటి హీరోలు ఈ నెలలోనే థియేటర్లలోకి వచ్చారు. అలా జులైలో అటుఇటుగా 26 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. కానీ, బాధాకరమైన విషయం ఏంటంటే.. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్టవ్వలేదు. సింపుల్ గా చెప్పాలంటే జులై నెల బాక్సాఫీస్ వెలవెలబోయింది. జీరో సక్సెస్ రేటు నమోదు చేసింది.
జులై మొదటి వారంలో.. పక్కా కమర్షియల్, ఏనుగు, బాలరాజు, షికారు, టెన్త్ క్లాస్ డైరీస్ సినిమాలొచ్చాయి. వీటిలో గోపీచంద్-మారుతి కాంబోలో వచ్చిన పక్కా కమర్షియల్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే, థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ అంచనాల్ని అందుకోలేకపోయింది ఈ మూవీ. రిలీజైన మొదటి రోజు మొదటి ఆటకే అట్టర్ ఫ్లాప్ అయింది. కామెడీగా ఉంటుందని థియేటర్లకు వచ్చిన ఆడియన్స్ ను తేలిగ్గా తీసుకొని, వెటకారంగా తీసినట్టుంది ఈ సినిమా. ఈ మూవీతో పాటు మిగతా సినిమాలన్నీ ఫ్లాప్స్ అయ్యాయి.
జులై రెండో వారంలో.. హ్యాపీ బర్త్ డే, గంధర్వ, మా నాన్న నక్సలైట్, కడువా, కొండవీడు, రుద్రసింహా సినిమాలొచ్చాయి. ఈసారి అన్నీ చిన్న సినిమాలే. కాకపోతే హ్యాపీ బర్త్ డేపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఎందుకంటే, గతంలో మత్తువదలరా లాంటి హిట్ సినిమా తీసిన దర్శకుడి నుంచి ఈ మూవీ వచ్చింది. పైగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యాకప్ ఉంది. అయినప్పటికీ హ్యాపీ బర్త్ డే సినిమా నిలబడలేదు. డిజాస్టర్ అయింది. ఈ మూవీతో పాటు మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.
జులై మూడో వారంలో.. వారియర్, గార్గి, అమ్మాయి, మై డియర్ భూతం సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో భారీ అంచనాలతో విడుదలైన సినిమా వారియర్. రామ్-కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. ఈ మూవీతో కోలీవుడ్ లో జెండా పాతేయాలనుకున్న రామ్ ఆశలు గల్లంతయ్యాయి. ఇక మిగతా సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.
జులై నాలుగో వారంలో.. థాంక్యూ, మీలో ఒకడు, హైయ్ ఫైవ్, జగన్నాటకం, మహా, దర్జా సినిమాలొచ్చాయి. ఈసారి కూడా పరిస్థితిలో మార్పులేదు. పక్కా కమర్షియల్, వారియర్ సినిమాల లిస్ట్ లోకి థాంక్యూ కూడా చేరిపోయింది. నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. ఇక మిగతా సినిమాలు కూడా ఇలా రిలీజై, అలా వెళ్లిపోయాయి.
ఇక జులై నెల చివరి శుక్రవారంలో.. రామారావు ఆన్ డ్యూటీ, విక్రాంత్ రోణ, పంచతంత్ర కథలు, ది లెజెండ్ సినిమాలొచ్చాయి. వీటిలో ఒక్కో సినిమాది ఒక్కో కథ. రవితేజ నటించిన సినిమా డిజాస్టర్ అయింది. తక్కువ ప్రీ-రిలీజ్ బిజినెస్ తో వచ్చిన విక్రాంత్ రోణ బ్రేక్ ఈవెన్ అయింది. పంచతంత్ర కథలు అనే సినిమా హైదరాబాద్ లో మాత్రమే రిలీజైంది. అది కూడా కేవలం 5 థియేటర్లలో మాత్రమే. ఇక శరవణన్ హీరోగా నటించిన లెజెండ్ సినిమా థియేటర్లలో నవ్వులు పంచుతోంది. హీరో ఏడ్చే సీన్ చేసినప్పటికీ, థియేటర్లలో జనం నవ్వుతున్నారు.
ఇలా జులై నెలలో వచ్చిన సినిమాలన్నీ వేటికవే ఫ్లాపులయ్యాయి. ఆగస్ట్ లో మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ2, బింబిసార లాంటి ప్రామిసింగ్ మూవీస్ వస్తున్నాయి. వీటిలో ఎన్ని అంచనాల్ని నిలబెట్టుకుంటాయో చూడాలి.