హైదరాబాద్: జనసేన పార్టీ కోసం కష్టపడితే ఆదుకుంటామని చెప్పి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని సునీత బోయ అనే జూనియర్ ఆర్టిస్ట్ ఆందోళనకి దిగింది. గీతా ఆర్ట్స్‌లో సినిమా ఛాన్సులు ఇస్తామని చెప్పి నిర్మాత బన్నీవాస్ తనను మోసం చేశారని ఆరోపిస్తున్న సునీత.. ఫిలిం ఛాంబర్ ముందు గొలుసులతో తనను తాను బంధించుకుని రాత్రి నుంచి నిరసన తెలియజేస్తోంది. తనకు జరిగిన మోసం మీద అల్లు అరవింద్ స్పందించాలని ఆమె డిమాండ్ చేస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సునీతను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఎవరీ సునీత బోయ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో, బయటా టాపిక్ అయ్యింది. చిన్న చిన్న సినిమాల్లో నటించిన సునీత ఎవరికీ అంతగా గుర్తుండిపోయే ఫేమ్ కాకనప్పటికీ, మూవీ క్రిటిక్ మహేష్ కత్తి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని అప్పట్లో ఆమె చేసిన హడావిడి మాత్రం అందరికీ తెలుసు. తన ఫ్లాట్‌కి పిలిపించుకునే వాడని.. డబ్బులు పేటీఎం చేసేవాడంటూ ఆమె చేసిన రచ్చ అప్పట్లో హాట్ టాపిక్. పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి యాక్టివ్ మెంబర్‌గా పనిచేస్తూ శ్రీరెడ్డికి సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తూ వచ్చిన సునీత తాజాగా తనకు అవకాశాలు ఇవ్వడం లేదని బన్నీవాస్‌పై ఆరోపణలు చేస్తోంది.